మణిపూర్ లో సాధారణ పరిస్థితులకై కేంద్రం కృషి

గత 50 రోజులకు పైగా హింసాకాండతో కొట్టుమిట్టాడుతున్న ఈశాన్యరాష్ట్రం మణిపూర్ లో సాధారణ పరిస్థితులు తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం శాయశక్తులా యత్నిస్తోందని విపక్షాలకు  హోంమంత్రి అమిత్ షా అమిత్ షా తెలిపారు. వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం లేదనడం సరికాదని అమిత్ షా తెలిపారు. పరి

స్థితిపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సూచనలు వెలువరించడం, తాను ప్రధానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేయడం జరుగుతోందని, ఇది జరగని రోజు లేనేలేదని స్పష్టం చేశారు. పరిస్థితిపై సమీక్షించేందుకు శనివారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి అధ్యక్షత వహించిన హోం మంత్రి అమిత్ షా ఇతర శక్తులు హింసాకాండను రెచ్చగొడుతున్నాయనే అనుమానాలతో మయన్మార్ సరిహద్దు వెంబడి చొరబాట్లు అరికడుతున్నట్లు తెలిపారు. 10 కిలోమీటర్ల పొడవైన కంచెను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఇతరత్రా కట్టడి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు, ఎక్కువగా చొరబాటుదార్లలో యువతనే ఉన్నారని, వీరు ఇప్పుడు అధికారుల ముందు ఆయుధాలతో సరెండర్ అయ్యారని వివరించారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి సరైన సలహాలు సూచనలు, ప్రతిపాదనలు తీసుకుని, సముచిత రీతిలో పరిష్కారానికి కేంద్రం ముందుకు వెళ్లుతుందని హామీ ఇచ్చారు.

ముందుగా మణిపూర్‌కు కేంద్ర ప్రభుత్వం తరఫున అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని విపక్షాలు కోరాయి. ఈ ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఇప్పటి భేటీలో విస్తృతస్థాయిలో చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మే 3 నుంచి ఆగకుండా హింసచెలరేగుతున్న ఈ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని సమాజ్‌వాదీపార్టీ, ఇతర పార్టీలు కోరాయి.

ప్రధాని నరేంద్ర మోదీ  ఎప్పటికప్పుడు పరిస్థితిపై సరైన రీతిలో తెలుసుకుంటున్నారని, ప్రధాని ఆదేశాల మేరకు శాంతి పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపిందని భేటీ తరువాత బిజెపికి చెందిన మణిపూర్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సంబిత్ పాత్ర విలేకరులకు తెలిపారు. అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్, బిజెపి, టిఎంసి, ఆప్, బిజెడి, సిపిఎం, డిఎంకె, బిఆర్ఎస్, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు.

మణిపూర్‌పై, ఈశాన్య భారతంపై ప్రతిపక్షాలది ఒకటే మాటగా ఉందని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మూడు గంటల పాటు జరిగిన భేటీ తర్వాత టిఎంసి నేత ఒబ్రెయిన్ విలేకరులకు తెలిపారు. అఖిలపక్షాన్ని అక్కడికి తీసుకువెళ్లాలని, ముఖ్యమంత్రిని బర్తరప్ చేయాలనేదే ప్రతిపక్షాల డిమాండ్ అని వివరించారు.

మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితి దిగజారడానికి పూర్తి బాధ్యత కేంద్రానిదే అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ సమావేశానికి కేంద్రం తరఫున మంత్రులు ప్రహ్లాద్ జోషీ, నిత్యానంద రాయ్, అజయ్‌కుమార్ మిశ్రా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దెకా కూడా హాజరయ్యారు.