రష్యాను వీడి బెలారస్‌కు తిరుగుబాటు నేత ప్రిగోజిన్‌

రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసిన కిరాయి సేన అయిన ‘వాగ్నర్ గ్రూప్‌’ చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ రోస్తోవ్ నగరాన్ని విడిచి బెలారస్‌కు వెళ్లిపోయాడు. ఆయన రోస్తోవ్‌ను వదిలి బెలారస్‌కు వెళ్ళిపోతున్న చిత్రాలను రాయిటర్స్ వార్తా సంస్థ విడుదల చేసింది.
 
రష్యా సైన్యంపై ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేయడం, ఆ తర్వాత బెలారస్‌కు పలాయనం చిత్తగించడం కేవలం 24 గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి.
ఒక రోజు క్రితం ప్రిగోజిన్‌ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూప్‌ రోస్తోవ్‌ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తమ సేనలపై దాడులు చేసినందుకు ప్రతిగా తాము రష్యా సైన్యంపై బదులు తీర్చుకుంటామని ప్రిగోజిన్‌ హెచ్చరించారు.
 
ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే ఆయన బెలారస్‌కు వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.యెవ్‌గెనీ ప్రిగోజిన్ రోస్తోవ్ నగరంలోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి వాహనంలో వెళ్లిపోతున్నారని రాయిటర్స్ తెలిపింది.
 
రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ప్రకటించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన బెలారస్ అధ్యక్షుడు, వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రగోజిన్‌తో చర్చలు జరిపారు. ఉద్రిక్తతను సడలించడానికి బలగాలను నిలువరించాలని లుకషెంకో విజ్ఞప్తి చేశారు. ఇరివురి మధ్య జరిగిన చర్చల అనంతరం రష్యా సైన్యం, వాగ్నర్ గ్రూప్ మధ్య రాజీ ఒప్పందం కుదిరింది.
 
దీంతో ఉక్రెయిన్‌లోని శిబిరాలకు తిరిగి వెళ్లిపోవాలని ప్రిగోజన్ తన సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు, రాజీ ఒప్పందం అనంతరం వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు ఎత్తివేస్తామని క్రెమ్లిన్ ప్రకటించారు. ప్రిగోజిన్ రష్యా నుంచి బెలారస్‌కు వెళ్ళిపోతున్నారని, రక్తపాతాన్ని నివారించడానికి ఆయనతో పాటు వాగ్నర్ దళాల మీద ఉన్న అభియోగాలన్నింటినీ అధికారులు ఉపసంహరించుకున్నారని రష్యా ప్రభుత్వ మీడియా కూడా ప్రకటించింది.