ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో చీకటికాలం

ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1975లో విధించిన ఎమర్జెన్సీ  భారతదేశ చరిత్రలో చీకటి కాలమని, రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకంగా అప్పట్లో అత్యవసర పరిస్థితి విధించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
 
”ఎమర్జెన్సీని వ్యతిరేకించి మన ప్రజాస్వామ్య విలువల పటిష్టానికి పాటుపడిన సాహసవంతులందరికీ ఘనంగా నివాళర్పిస్తున్నాను. చరిత్రలో ఎమర్జెన్సీ కాలం నాటి చీకటి రోజులు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. మన రాజ్యాంగ విలువలను పూర్తిగా తుంగలోకి తొక్కారు” అని మోదీ ఆదివారంనాడు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈజిప్టులో మోదీ పర్యటిస్తున్నారు.
 
  బిజెపి కూడా  ఇందిరాగాంధీ ఫోటోతో   ”భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం” అని పోస్టర్‌ని ట్వీట్‌ చేసింది.    నిరంకుశ పాలకులు ప్రకటించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులను దెబ్బతీశాయని, ఇది ఒక నిర్దిష్ట కుటుంబం, రాజకీయ పార్టీ అహంకారం, అధికారాన్ని అంటిపెట్టుకోవాలనే కోరిక అంటూ మరో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ట్వీట్‌ చేశారు.    కాగా, ఎమర్జెన్సీ చీకటి రోజులకు 48 ఏళ్లు అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేతలు ‘బ్లాక్ డే’ పాటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ‘బ్లాక్ డే’ పాటించింది. ఈ సందర్భంగా ‘మహా జన సంపర్క్’ ప్రచారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గౌతమ్‌బుథ్ నగర్‌లో ప్రారంభించగా, ఆగ్రాలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొన్నారు.

కైరానా, మీరట్, ఘజియాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రసంగించారు.