బైడెన్‌కు ఉప‌నిష‌త్తుల‌ పుస్త‌కాన్ని బహుకరించిన మోదీ

మొదటిసారి అమెరికా ప్రభుత్వ అధికారిక ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు. బుధవారం న్యూయార్క్ నుంచి రాజధాని వాషింగ్టన్ డీసీ చేరుకున్న భారత ప్రధానికి ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌లో సైనిక కవాతుతో స్వాగతం లభించింది. ఈ సందర్భంగా భారత్, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. అక్కడ నుంచి అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధానికి మోదీ చేరుకున్నారు.
 
వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులు ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైడెన్ దంపతులకు మోదీ భారత్ తరఫున అరుదైన కానుకలు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎర్ర చందనంతో తయారుచేసిన పెట్టలో వెండి వినాయకుడి విగ్రహం, దీపం కుందెను బహుకరించారు.
 
లండ‌న్‌కు చెందిన ఫేబ‌ర్ అండ్ ఫేబ‌ర్ లిమిటెడ్ కంపెనీ ప్ర‌చురించిన ద టెన్ ప్రిన్సిప‌ల్ ఉప‌నిష‌ద్స్ అన్న పుస్త‌కానికి చెందిన ప్రతిని బైడెన్‌కు బహుమతిగా ఇచ్చారు. గ్లాస్‌గోవ్ ప్రెస్ యూనివ‌ర్సిటీలో తొలిసారి ఈ పుస్త‌కాన్ని అచ్చు వేశారు. 1937లో ఆంగ్ల ర‌చ‌యిత డ‌బ్ల్యూబీ యేట్స్  భార‌తీయ ఉప‌నిష‌తుల‌ను త‌ర్జుమా చేసి ఓ పుస్త‌కాన్ని ప్ర‌చురించారు.
 
పురోహిత్ స్వామితో క‌లిసి ఆయ‌న ఆ పుస్త‌కాన్ని రాశారు. 1930 ద‌శ‌కంలో ఆ పుస్త‌క ర‌చ‌న సాగింది. యేట్స్ చివ‌రి ర‌చ‌న అదే. ఫేబ‌ర్ సంస్థ దీన్ని ప‌బ్లిష్ చేసింది. అలాగే, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు ప‌రిశోధ‌న‌శాల‌లో అభివృద్ధి చేసిన 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని మోదీ కానుకగా ఇచినట్లు అధికారులు తెలిపారు. భూమి నుంచి వ‌చ్చిన వ‌జ్రం త‌ర‌హాలోనే ఆ గ్రీన్ డైమండ్ ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ట‌. ఆ వ‌జ్రం ఎకో ఫ్రెండ్లీ. సౌర‌, ప‌వ‌న విద్యుత్తు ద్వారా ఆ వ‌జ్రాన్ని త‌యారు చేశారు.
జో బైడెన్ దంపతులు కూడా ప్రధాని మోదీకి అరుదైన బహుమతులు అందజేశారు. జో బైడెన్ నుంచి హ్యాండ్‌మేడ్, పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చారు. పాతకాలపు అమెరికన్ కెమెరా, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన హార్డ్‌కవర్ పుస్తకం, ‘కలెక్టెడ్ పోయెమ్స్ ఆఫ్ రాబర్ట్ ఫ్రాస్ట్’ సంతకం చేసిన మొదటి ఎడిషన్ కాపీని ప్రధాని మోదీకి బైడెన్ దంపతులు బహుమతిగా ఇచ్చారు.
అటు, మోదీకి బైడెన్ దంపతులు అధికారిక విందును ఏర్పాటు చేశారు. నెమళ్లు, తామర పువ్వులతో అధ్యక్ష భవనాన్ని అలకరించారు. విందు కోసం గ్రిల్డ్ కార్న్ కెర్నాల్ సలాడ్, ఆవకడో సాస్ వంటి ప్రత్యేక శాకాహార వంటకాలను తయారు చేయించారు. విందు అనంతరం  గ్రామీ అవార్డ్ విన్నర్ జోషువా బెల్, దక్షిణాసియా మ్యూజిక్ గ్రూప్ పెన్ మాసలాల సంగీత ప్రదర్శన ఉంటుందని జిల్ బైడెన్ తెలిపారు.
 
విందు జరిగే ప్రదేశం అమెరికా, భారత్ ల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటుందని జిల్ బైడెన్ తెలిపారు.భారత జాతీయ జెండాలోని రంగులైన తెలుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులను ప్రతిబింబించేలా ఆయా రంగుల పూలను ప్రతీ టేబుల్ పై అలంకరిస్తామని వెల్లడించారు. ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ప్రజాస్వమ్య దేశం, ఈ రెండింటి కలయిక అని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ను జిల్ బైడెన్ అభివర్ణించారు.