ఒక్క కమిషనర్ కూడా లేని తెలంగాణ సమాచార కమిషన్

తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌లో ఒక్కరంటే ఒక్క కమిషనర్‌ కూడా లేకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ కౌంటర్‌ అఫిడవిట్లు అవసరం లేదని, చీఫ్‌ కమిషనర్‌, కమిషనర్‌లను ఎప్పుడు నియమిస్తారో కచ్చితంగా చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.  ‘‘ఒక్క కమిషనర్‌ కూడా లేకుండా సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే అప్పీళ్లను ఎవరు విచారిస్తారు? అక్కడ ఉన్న సిబ్బంది విచారిస్తారా?’’ అంటూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

కమిషన్ లో  కమిషనర్లు లేనప్పుడు సమాచార హక్కు చట్టం చేసి ఏం లాభం అని చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం నిలదీసింది.  రాష్ట్ర సమాచార కమిషన్‌కు చీఫ్‌ కమిషనర్‌తోపాటు ఒక్క కమిషనర్‌ కూడా లేరని, వారిని నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రస్తుత ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్న అంశం అత్యంత ప్రాధాన్యం కలిగిందని వ్యాఖ్యానించింది. సమాచార కమిషన్‌ పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేలా ఏయే చర్యలు తీసుకున్నారో వివరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మంగళవారం ఈ పిటిషన్‌ మరోసారి చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ కమిషనర్లను నియమించే అంశం ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉందని, రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో, ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రియాశీల పరిశీలన అంటే ఏమిటి? అంటూ ప్రశ్నించింది.

“చీఫ్‌ సెక్రటరీ సమర్పించిన నివేదికలో కాంపిటెంట్‌ అథారిటీ క్రియాశీల పరిశీలనలో ఉందని రాశారు. ఇది అంతా అస్పష్టంగా, కాస్తంత కూడా స్పష్టత లేకుండా ఇచ్చిన ప్రకటనలా కనిపిస్తోంది? సదరు ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయి? ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, క్యాబినెట్‌ మంత్రి సభ్యులుగా కలిగిన కమిటీ ముందు ప్రతిపాదనలను ఎప్పుడు పెట్టారు? అనే ఏ వివరాలు లేవు” అంటూ నిలదీసింది.

ఇది ముఖ్యమైన అంశమని ఇంతకుముందే స్పష్టం చేసి, తగిన సమయం ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ సమయం అడగడం సమంజసం కాదని స్పష్టం చేసింది.  “డిపార్ట్‌మెంట్‌ నుంచి అడ్వకేట్‌ ఫీజు ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి సమాచార కమిషన్‌లో మీరే అప్పీల్‌ దాఖలు చేశారనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? మీ పిటిషన్‌ను ఎవరు విచారిస్తారు?’’ అని ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించింది.

మీ కౌంటర్‌ అఫిడవిట్లు అక్కర్లేదని, వారిని ఎప్పుడు నియమిస్తారో కచ్చితంగా చెప్పాలని ప్రశ్నించింది. చీఫ్‌ కమిషనర్‌ 2020 ఆగస్టులో రిటైర్‌ అయ్యారు. ఆయన పదవీ విరమణ చేసి ఇప్పటికి మూడేళ్లు అవుతోందని గుర్తు చేసింది. చిట్టచివరి కమిషనర్‌ కూడా 2023 ఫిబ్రవరి 24న రిటైర్‌ అయ్యారని తెలిపింది. నాలుగు నెలల నుంచి ఒక్క కమిషనర్‌ కూడా లేకుండానే కమిషన్‌ పని చేస్తోంది.

ఒక్క కమిషనర్‌ కూడా లేకుండా ఇక కమిషన్‌ ఉండి ఏం లాభం? సమాచార హక్కు చట్టం చేసి ఏం ప్రయోజనం? అప్పీళ్లను కార్యాలయంలో ఉన్న సిబ్బంది విచారిస్తారని భావిస్తున్నారా? అని నిలదీసింది. తదుపరి విచారణకు అడ్వకేట్‌ జనరల్‌, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఇద్దరూ హాజరుకావాలని ధర్మాసనం నిర్దేశించింది. ఈ కేసును లిస్ట్‌ చేసినప్పుడు ఏజీ, ఏఏజీ ఇద్దరి పేర్లు ప్రింట్‌ చేయాలని రిజిస్ర్టీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 5వ తేదీకి వాయిదా వేసింది.