ఐఐటీ బాంబేకు నందన్ నీలేకని రూ. 315 కోట్ల విరాళం

ఐఐటీ బాంబేకు నందన్ నీలేకని రూ. 315 కోట్ల విరాళం
తాను ఉన్నత శిఖరాలకు చేరేందుకు తన జీవితంలో కీలక పాత్ర పోషించిన ఐఐటీ బాంబే రుణం తీర్చుకున్నారు ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నందన్​ నీలేకని! ఐఐటీ బాంబేతో తన 50 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా ఏకంగా రూ. 315 కోట్లను విరాళంగా ఇచ్చారు! ఐఐటీ బాంబేకు గతంలో రూ. 85 కోట్లను విరాళంగా ఇవ్వగా, తాజా విరాళంతో ఆ సంఖ్య రూ. 400 కోట్లకు  చేరింది.

1973లో ఐఐటీ బొంబైలో చేరిన నందన్​ నీలేకని ఎలక్ట్రికల్​ ఇంజనీరింగ్​ నుంచి బ్యాచిలర్స్​ డిగ్రీ పొందారు. “నా జీవితంలో ఐఐటీ బాంబేది అత్యంత కీలక పాత్ర. నా ప్రొఫెషనల్​ కెరీర్​ను ఈ విద్యాసంస్థ తీర్చిదిద్దింది. ఈ ప్రఖ్యాత వర్సిటీతో నా అనుబంధానికి 50 ఏళ్లు గడిచాయి. అందుకు గుర్తుగా రూ. 315కోట్లు విరాళాన్ని ఇస్తున్నాను” అని ప్రకటించారు.

“భవిష్యత్తులో మా అనుబంధం కొనసాగాలని అభిప్రాయపడుతున్నాను. ఇది ఆర్థికపరమైన విరాళం మాత్రమే కాదు. అంతకు మించి! నాకు ఎంతో ఇచ్చిన విద్యాసంస్థకు ట్రిబ్యూట్​ ఇది. రేపటి ప్రపంచాన్ని తీర్చిదిద్దే విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను,” అని నందన్​ నీలేకని తెలిపారు.

ఇన్ఫోసిస్​ కో ఫౌండర్​ విరాళంగా ఇచ్చిన డబ్బును  ప్రపంచ స్థాయి మౌలిక వసతులను వర్సిటీలో ఏర్పాటు చేసేందుకు, ఇంజినీరింగ్​- టెక్నాలజీలో పుట్టుకొస్తున్న నూతన అంశాలపై రీసెర్చ్​ చేసేందుకు ఉపయోగించనున్నట్టు ఐఐటీ బాంబే వెల్లడించింది. విద్యాసంస్థ చరిత్రలో అందిన అతి పెద్ద విరాళం ఇదేనని పేర్కొంది.

నీలేకని, ఐఐటీ బాంబే డైరక్టర్​ ప్రొఫెసర్​ సుభాషిష్​ చౌదరిలు ఈ విరాళానికి సంబంధించి ఎంఓయూ (మెమొరాండమ్​ ఆఫ్​ అండర్​స్టాండింగ్​)పై మంగళవారం ఉదయం సంతకం చేశారు. ఈ విరాళంతో ఐఐటీ బాంబే ప్రపంచస్థాయికి ఎదుగుతుందని చౌదరి పేర్కొన్నారు.