మణిపూర్‌ రాజకీయ నేతపై దేశద్రోహం కేసు

మణిపూర్‌లో సంక్షోభం నెలకొనడానికి కారణం రాష్ట్రంలోని అస్సాం రైఫిల్స్‌ యూనిట్‌ అని వ్యాఖ్యానించినందుకు ఇంఫాల్‌కి చెందిన రాజకీయ నేతపై పోలీసులు దేశ ద్రోహం కేసును నమోదు చేశారు. అస్సాం రైఫిల్స్‌ ఇనస్పెక్టర్‌ జనరల్‌ (ఐజిఎఆర్‌) (దక్షిణ) ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు జగత్‌ తొడమ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని ఫ్రాంటియర్‌ మణిపూర్‌ పేర్కొంది.

తోడమ్‌ వ్యాఖ్యలను పలు వార్తాపత్రికలు ప్రచురించిన నేపథ్యంలో ఐజిఎఆర్‌ (దక్షిణ) ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ”వార్తా పత్రికల్లో వచ్చిన వార్తా కథనం ఏకపక్షంగా వుంది. పూర్తిగా నిష్పాక్షికత లోపించింది. ఇది పూర్తిగా నిరాధారమైనది, పరువునష్టం కలిగించేది, అస్సాం రైఫిల్స్‌కు వ్యతిరేకంగా విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ఉద్దేశించినట్లుగా వుంది. పైగా రెండు కమ్యూనిటీల మధ్య శతృత్వం రెచ్చగొట్టడానికి చేసిందిగా వుంది.” అని ఆ పత్రికా ప్రకటన పేర్కొంది.

మణిపూర్‌కి చెందిన ఇండీజనెస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ సలహాదారైన తోడమ్‌పై ఐపిసిలోని153 (ఎ) సెక్షన్‌ ((రెండు వేర్వురు గ్రూపుల మధ్య సామరస్యతను దెబ్బతీసేందుకు వ్యవహరించడం) కింద అభియోగాలు మోపారు. ఈశాన్య భారతంలో పనిచేసే పేరా మిలటరీ బలగాలైన అస్సాం రైఫిల్స్‌ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో వుంటుంది.

”జాతుల ఘర్షణలో మిలిటెంట్లతో ప్రజలు పోరాడరు” అను శీర్షికతో వచ్చిన వార్తా కథనంలో రైఫిల్స్‌పై తోడమ్‌ అనేక ఆరోపణలను ప్రశ్నల రూపంలో సంధించారు. బూటకపు వార్తలను పుకార్లను, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై దేశద్రోహం కేసు విధిస్తామని గతంలోనే మణిపూర్‌ చీఫ్‌ సెక్రటరీ హెచ్చరించారు.

కాగా రాష్ట్రంలో హింస కొనసాగుతునే వుంది. గురు, శుక్రవారాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులకు చెందిన ఇళ్ళకు నిప్పంటించారు. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత మంత్రి తొంగమ్‌ బిశ్వజిత్‌ ఇంటిని ధ్వంసం చేయడానికి దాదాపు 300 మందితో కూడిన అల్లరి మూక ప్రయత్నించింది. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌ఎఎఫ్‌) దళాలు వెంటనే వారిని తరిమిగొట్టాయి.

ఇంఫాల్‌ నగరమంతా ఇటువంటి అల్లర్లు, ఘర్షణల సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతునే వున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎ.శారదాదేవి ఇంటిని కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. సింగ్జామి వద్ద బిజెపి కార్యాలయాన్ని ఘెరావ్‌ చేసిన వారిని సైనికులు చెల్లాచెదురు చేశారు. అనంతరం సైన్యం, ఆస్సాం రైఫిల్స్‌, ఆర్‌ఎఎఫ్‌ బలగాలు ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాలో ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహించాయి. ఇంఫాల్‌లోని ఇరింగ్బమ్‌ పోలీసు స్టేషన్‌ నుండి ఆయుధాలు దోచుకునే ప్రయతుం కూడా జరిగింది. అంతకుముందు ఆందోళనకారులు రహదారులపై దిగ్బంధించారు. నగరంలోని ఆస్తులను తగలబెట్టారు.