పాఠ్యాంశాల తొలగింపుపై మండిపడ్డ రంజిత్ సావర్కర్

 
కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి ఆరు నుంచి పదో తరగతి సాంఘిక పాఠ్య పుస్తకాల్లో ఉన్న ఆరెస్సెస్‌ వ్యవవస్థాపకుడు కెబి హెడ్గేవార్‌, విడి సావర్కర్‌ల పాఠ్యాంశాలను తొలగించింది. దీనిపై సావర్కర్‌ మనవడు రంజిత్‌ సావర్కర్‌ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
 
తాజాగా ఆయన గోవాలో జరిగిన ఓ ఈవెంట్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘సావర్కర్‌ అధ్యాయాన్ని తొలగించడం ద్వారా విద్యార్థులు సావర్కర్‌ గురించి తెలుసుకునే అవకాశాన్ని కోల్పోతారని కాంగ్రెస్‌ భావించవచ్చు. అయితే విద్యార్థులు చాలా తెలివైన వారు. సావర్కర్‌ గురించి తెలుసుకోవాలనుకుంటే విద్యార్థులు సోషల్‌మీడియాను ఆశ్రయిస్తారు’ అని స్పష్టం చేశారు.
 
`ప్రస్తుతం సావర్కర్‌పై చాలా విషయాలు సోషల్‌మీడియాలో అందుబాటులో ఉన్నాయి. సావర్కర్‌ స్మారక్‌ అనే వెబ్‌సైట్‌ అతని సాహిత్యాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఆ సాహిత్యాన్ని కన్నడలో కూడా ప్రచురిస్తున్నాం. సిలబస్‌ నుండి అధ్యాయాన్ని తొలగిస్తే ఎటువంటి తేడా ఉండదు’ అని ఆయన వెల్లడించారు.
 
 ఈ సందర్బంగా ఆయన న్యూటన్‌ సిద్ధాంతాన్ని ఉంటంకించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడతూ. ‘నిజానికి మీరు మరింత అణచివేస్తే అది మరింత పుంజుకుంటుంది అని నేను చెబుతాను. అది సహజ ప్రతిచర్య. ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉఉంటుందని న్యూటన్‌ మూడవ నియమం తెలుపుతుంది’ అని ఆయన గుర్తు చేశారు