హైదరాబాద్ లో చిచ్చు రేపిన హిజాబ్.. హోమ్ మంత్రి అనుచిత వాఖ్యలు!

హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం చిచ్చురేపింది. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి మహమూద్ అలీ మహిళల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆజ్యంపోశాయి. కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి పరీక్షకు రావడంపై కాలేజీ యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. హిజాబ్ తీసేస్తేనే పరీక్షకు అనుమతిస్తామని చెప్పడంతో వారంతా హిజాబ్ తొలగించి పరీక్ష రాశారు.

దీనిపై స్పందించిన మహమూద్ అలీ మహిళలు తమకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చని చెప్పారు. కానీ యూరోపియన్ల తరహాలో పొట్టి దుస్తులు వేసుకోవద్దని సూచించారు.  అలా కురుచ దుస్తులు వేసుకునే మహిళలు ఇబ్బందుల పాలవుతారని, నిండుగా బట్టలు వేసుకుంటే చాలా సౌకర్యవంతంగా ఉండొచని హితవు చెప్పారు. ముస్లింలైతే హిజాబ్, హిందూ మహిళలు కొంగు ధరించవచ్చని సూచించారు.

ఇలాంటి వస్త్రధారణతో మహిళలపై మరింత గౌరవం పెరుగుతుందని వ్యాఖ్యనించారు. హిజాబ్ ధరించి పరీక్షకు వచ్చిన వారిని అనుమతించకపోవడంపై తాను కాలేజీ సిబ్బందితో మాట్లాడుతానని చెప్పారు. ఆ కాలేజీపై తప్పక చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ హామీ ఇచ్చారు.

మంత్రి వాఖ్యలపై రాణి రుద్రమదేవి ఆగ్రహం 

కాగా, మహిళల వస్త్రధారణ పై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమదేవి మండిపడ్డారు.  హోం మంత్రి వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు నెత్తి మీద  హిజాబ్  ధరిస్తేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారని మాట్లాడడం మహిళలను అవమానించడమే అని ఆమె స్పష్టం చేశారు. “*ఆరు నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలపై ఏ రోజు మాట్లాడని హోమ్ మంత్రి మహిళల వస్త్రధారణ వాటికి కారణం అన్నట్లుగా మాట్లాడడం చేతగాని తనానికి నిదర్శనం. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించటమే, కించపరచడమే” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో పసి పిల్లలపై, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలపై రోజుకు సగటున ఏడు పోస్కో కేసులు  కేసులు నమోదయితున్నాయి. దానికి కూడా వస్త్రధారణ కారణమా? అంటూ బాధ్యత లేని హోంమంత్రి సమాధానం చెప్పాలని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో ఎంఐఎం, టిఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో అత్యాచారాలకు హత్యలకు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించలేని అసమర్ధ హోంమంత్రి
మహమూద్ అలీ అని ఆమె ధ్వజమెత్తారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  లైంగికంగా వేధిస్తున్నాడంటూ  బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేసినా నేటికీ కేసు ఫైల్ చేయకపోతే , ఢిల్లీకి వెళ్లి న్యాయం కోసం పోరాడాల్సినటువంటి దుస్థితి తెలంగాణ మహిళలకు పట్టిందని ఆమె గుర్తు చేశారు.

మహిళలకు మొదటి క్యాబినెట్ లో ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేని వాళ్ళు, మహిళా కమిషన్ కు చైర్మన్ ను ఆరెళ్లకుగానీ నియమించలేని చేతగాని ప్రభుత్వ పెద్దలు మహిళల వస్త్రధారణ పై అవాకులు చావాకులు పేలితే తెలంగాణ మహిళలు కచ్చితంగా బుద్ధి చెప్పడం ఖాయం అంటూ ఆమె హెచ్చరించారు.