అమర్‌నాథ్‌ యాత్రలో సమోసా, జిలేబీలపై నిషేధం

యాత్రికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరపు అమర్‌నాథ్‌ యాత్రలో చిరుతిండ్లు, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాలపై కఠినంగా వ్యవహరించాలని శ్రీ అమర్‌నాథ్‌జీ పర్వత క్షేత్ర బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) నిర్ణయించింది. ఈ మేరకు జులై ఒకటవ తేదీ నుంచి 62 రోజుల పాటు సాగే యాత్రలో హల్వాపూరి, సమోసాలు, జిలేబీ, గులామ్‌ జాబ్‌ తదితర తినుబండరాలను నిషేధిస్తున్నట్టు ఎస్‌ఏఎస్‌బీ ఆదివారం తెలిపింది.

యాత్రకు దారి తీసే రెండు మార్గాల్లో 120కి పైగా లంగర్లను (సామాజిక వర్గాలకు చెందిన భోజనశాలలు) ఈ ఏడాది నెలకొల్పినట్టు ఎస్‌ఏఎస్‌బీ అధికారులు తెలిపారు. యాత్రికుల ఆరోగ్యం దృష్ట్యా అనుమతించిన, నిషేధించిన ఆహార పదార్థాల జాబితాను ఎస్‌ఏఎస్‌బీ విడుదల చేసింది. జాబితాకు లోబడి పైన పేర్కొన్న 120 లంగర్లలో యాత్రికులకు ఆహార పదార్థాలను లంగర్ల నిర్వాహకులు అందించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

నిషేధిత ఆహార పదార్థాలు, పానీయాల జాబితాలో పూరి, బతూరా, పిజ్జా, బర్గర్‌, పరోటా, దోశ, వేయించిన రోటీ, బ్రెడ్‌, వెన్న, క్రీమ్‌తో కూడి పదార్థాలు, పచ్చళ్ళు, చట్నీలు, వేయించిన అప్పడాలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌, కూల్‌ డ్రింక్స్‌, కారా హల్వా, జిలేబీ, గులాబ్‌ జామ్‌, లడ్డు, ఖోయా బర్ఫీ, రసగుల్లా, హల్వాతో కూడిన తినుబండారాలు, చిప్స్‌, కుర్‌కురే, మిక్సర్‌, పకోడా, సమోసా, నాన్‌ వెజ్‌ పదార్థాలు ఉన్నాయి. వీటితో పాటుగా లిక్కర్‌, గుట్కా, పాన్‌ మసాలా, సిగరెట్లుపై నిషేధం విధించినట్టు అధికారులు తెలిపారు.