రూ.15 వేల‌కే పూరి, కాశీ, అయోధ్య యాత్ర

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శనకు వెళ్లాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా పూరి, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లకు  సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్‌ గౌరవ్‌ రైలును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.
‘పుణ్య క్షేత్ర యాత్ర’ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోండ‌గా, జూన్ 28న‌ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. సికింద్రాబాద్‌ నుంచి టూర్ ప్రారంభం అవుతుండ‌గాఇది 8 రాత్రులు, 9 రోజులు కొనసాగుతుంది.

మొదటి రోజు: మొదటి రోజు మధ్యాహ్నం సికింద్రాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. ప్రయాణ మార్గంలో సికింద్రాబాద్‌, కాజీపేట్‌, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలు ఆగనున్నది.

2వ రోజు: రెండో రోజు ఉదయం 09:35 గంటలకు పూరీకి చేరుకుంటారు. ఐఆర్‌సీటీసీ పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. తర్వాత, పూరీ జగన్నాథ ఆలయం సందర్శనకు వెళ్లాలి. అనంత‌రం హోటల్‌కి తిరిగి వెళ్తారు. భోజనం త‌ర్వాత రాత్రి పూరీలో బస ఉంటుంది.

3వ రోజు: మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి కోణార్క్ సూర్యదేవాలయం, ఒడిషా బీచ్ సందర్శన ఉంటుంది. త‌ర్వాత‌ మాల్తీపాట్పూర్‌ రైల్వే స్టేషన్ నుంచి గయకు ప్రయాణం మొదలవుతుంది.

4వ రోజు: నాలుగోరోజు ఉదయం 8:30 గంటలకు గయకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం చేసి గ‌య‌లోని విష్ణుపాద దేవాలయాన్ని సందర్శించి వారణాసికి ప్రయాణమవుతారు.

5వ రోజు: ఐదో రోజు ఉదయం 6 గంటలకు వారణాసి చేరుకుంటారు. అల్పాహారం చేసిన అనంత‌రం కాశీ విశ్వనాథ దేవాలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతి ని వీక్షించి రాత్రి అయోధ్యకు ప్రయాణమవుతారు.

6వ రోజో: ఆరో రోజు అయోధ్యకు చేరుకుంటారు. శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకున్న త‌ర్వాత‌, సాయంత్రం సరయూ హారతిని చూసి ప్రయాగ్‌రాజ్‌కు పయనమవుతారు.

7వ రోజు: ఏడోరోజు ఉదయం ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. ఉదయం అల్పాహారం చేసిన అనంతరం అక్కడ త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమాన మండపాన్ని సందర్శించి  తిరుగు ప్రయాణమవుతారు.

8వ రోజు: ఎనిమిదో రోజు తిరుగు ప్రయాణంలో విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు భారత్‌ గౌరవ్‌ రైలు చేరుకుంటుంది.

9వ: తొమ్మిదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట ప్రాంతాల గుండా ప్రయాణించి రాత్రి 7:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

భారత్‌ గౌరవ్‌ రైలులో మూడు ప్యాకేజీలు అందుబాటులో ఉండనున్నాయి. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.31,260, స్టాండర్డ్‌లో రూ.23,875, ఎకానమీ క్లాస్‌లో రూ.15,075గా నిర్ణయించారు. ఐదు నుంచి 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.14,070, రూ.22,695, రూ.29,845గా నిర్ణయించినట్లు తెలిపింది.

ఈ రైల్లో మొత్తం 700 సీట్లు అందుబాటులో ఉండగా, 460 స్లీపర్ బెర్తులు, 192 థర్డ్‌ ఏసీ బెర్త్‌లు, 48 సెకండ్‌ ఏసీ బెర్త్‌లు ఉంటాయి. ఇక పుణ్యక్షేత్ర రైలులో ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించనున్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యం ఉంటుందని, ఆయా యాత్రా స్థలాల్లో ప్రవేశ రుసుం, బోటింగ్‌, సాహస క్రీడలు వంటివి ఈ ప్యాకేజీ పరిధిలోకి రావని తెలిపింది. పూర్తి వివరాల కోసం.. IRCTC వెబ్‌సైట్ లింక్ క్లిక్ చేయండి