ఎంపీ పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా

బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్లమెంటు సభ్యుడి పదవికి రాజీనామా చేశారు. తాను అన్ని రకాల కొవిడ్ నియమాలు పాటించినట్లు చెప్పిన బోరిస్ జాన్సన్ హౌస్ ఆఫ్ కామన్స్ ను తప్పుదారి పట్టించాడంటూ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో బోరిస్ జాన్సన్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.  తాను పార్లమెంటును విడిచిపెట్టడం చాలా విచారకరం అంటూ జాన్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
”నేను కొద్దిమంది వ్యక్తుల వల్ల బలవంతంగా బయటకు వెళుతున్నాను” అని ఆయన చెప్పారు. జాన్సన్ పార్లమెంటును నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని పార్లమెంటు ప్రివిలేజెస్ కమిటీ ఆరోపించింది.
 
”పార్లమెంటు నుంచి నన్ను తరిమికొట్టేందుకు జరుగుతున్న చర్యలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి, ప్రివిలేజెస్ కమిటీ నుంచి నాకు ఒక లేఖ అందింది” అని మాజీ ప్రధాని చెప్పారు.”2001 నుంచి ఎంపీగా ఉన్నాను. నా బాధ్యతలను సీరియస్‌గా తీసుకుంటాను. నేను అబద్ధం చెప్పలేదు, కానీ వారు ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని విస్మరించారు” అని జాన్సన్ ఆరోపించారు.

హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ (పార్లమెంటు దిగువ సభ)ను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని చూపించడానికి కమిటీ తన నివేదికలో ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయిందని ఆరోపించారు. నివేదిక అబద్ధాలతో, పక్షపాతంతో నిండి ఉందని ధ్వజమెత్తారు. మార్చిలో, కరోనా వైరస్‌ నిబంధనలను ధిక్కరించి స్నేహితులతో డిన్నర్‌ పార్టీని నిర్వహించడం ద్వారా తాను పార్లమెంటును తప్పుదారి పట్టించానని బోరిస్‌ విచారణ కమిటీ వద్ద అంగీకరించారు. అయితే ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని ఆయన చెప్పారు.

‘పార్టీ గేట్‌ కుంభకోణం’ కారణంగా 2022 జూలై 7న బోరిస్‌ తన ప్రధాని పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. 2020-21లో కరోనా మహమ్మారి సమయంలో, యుకె లో వివిధ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అప్పుడు ప్రధాని బోరిస్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ తన కార్యాలయంలో అనేక విందులు ఏర్పాటు చేశారు. దాని గురించి అతను ప్రశ్నను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ వ్యవహారాన్ని ‘పార్టీ గేట్‌ స్కామ్‌’ అంటారు.