తెలంగాణకు 12, ఏపీకి 5 మెడికల్ కాలేజీలు

దేశవ్యాప్తంగా కొత్తగా మరో 50 మెడికల్ ఏర్పాటునకు ఆమోదం  తెలిపిన జాతీయ వైద్య కమిషన్ తెలంగాణలో 12 కొత్త కాలేజీలకు,  ఆంధ్రప్రదేశ్ లో  ఐదు కొత్త కాలేజీలకు ఆమోదముద్ర వేసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ సీట్లు భారీగా పెరగనున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో తరగతులు మొదలవుతాయని వివరించింది.
తెలంగాణలో మేడ్చల్‌, వరంగల్‌, భూపాలపల్లి, కరీంనగర్‌, ఖమ్మం, అసిఫాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, హైదరాబాద్‌, జనగాంలలో ఏర్పాటైన కొత్త కళాశాలలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.  మేడ్చల్‌-మల్కాజిగిరిలో అరుంధతి ట్రస్ట్‌, మేడ్చల్‌లో సీఎంఆర్‌ ట్రస్ట్‌, వరంగల్‌లో కొలంబో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో వైద్యకళాశాలలు ఏర్పాటు కానున్నాయి. మిగిలిన అన్ని కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.
దీంతో  ఈ ఒక్క ఏడాదిలోనే తెలంగాణలో దాదాపు 900 మెడికల్ సీట్లు పెరగనున్నాయి.  రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో ఐదు మెడికల్ కాలేజీలు ఉండగా, ఈ తొమ్మిదేళ్ల కాలంలో వీటి సంఖ్య 26కి పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు అయ్యాయి. ఇవీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి.
 
 సెప్టెంబ‌ర్ నుంచి కొత్త మెడికల్ కాలేజీల్లో త‌ర‌గ‌తులు ప్రారంభించాలని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రూ.8500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో మొత్తం 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కొత్త కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 150 సీట్ల వంతున 750 సీట్లు అద‌నంగా రాబోతున్నాయి. రానున్న రెండు , మూడేళ్లలో ద‌శలవారీగా మిగిలిన 12 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది.