45 పైసలకే రూ.10 లక్షల వరకు రైల్వే ప్రయాణ బీమా

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. చనిపోయిన వారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఈ పరిస్థితుల్లో, రైలు ప్రయాణ భీమా ఆర్థికంగా ఆదుకుంటుంది.

దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చు రూ.10 లక్షల వరకు  బీమా అందుతుంది. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసే సమయంలో, ప్రయాణ భీమా ఆప్షన్ కూడా కనిపిస్తుంది.  దీనిని టిక్ చేస్తే  కేవలం 45 పైసలకే రూ. 10 లక్షల వరకు బీమా కవరేజ్ అందుతుంది. రైలు ప్రయాణ సమయంలో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ బీమా డబ్బు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.

రైలు ప్రయాణం కోసం ఆన్ లైన్ లో  టిక్కెట్ బుక్ చేస్తున్నప్పుడు ఐ ఆర్ సి టి సి వెబ్ సైట్ లో, యాప్ లోనో భీమా  ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఆ లింక్ ను బీమా సంస్థ పంపుతుంది.

లింక్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాలి. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది. రైల్వే ప్రయాణ భీమా ఉన్న సందర్భంలో, రైలు ప్రయాణ సమయంలో ప్రయాణీకుడికి ఏదైనా ప్రమాదం జరిగితే, జరిగిన నష్టాన్ని బట్టి బీమా మొత్తం అందుతుంది.

రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణించినా లేదా పూర్తిస్థాయి అంగవైకల్యం జరిగినా వారి  కుటుంబానికి రూ.10 లక్షలు అందుతుంది.  భీమా తీసుకున్న ప్రయాణికులు దురదృష్టవశాత్తు రైలు ప్రమాదంలో మరణిస్తే, వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చులు కోసం రూ.10,000 కూడా భీమా కంపెనీ కల్పిస్తుంది.

పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, గాయాలు అయితే రూ.2 లక్షలను ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తుంది. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయాన్ని వెళ్లి, వాళ్లు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు.