ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ర్టాల అసెంబ్లీల గడువు ముగియనున్నది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఐదు రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి ఆయా రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ శుక్రవారం సర్క్యూలర్‌ జారీచేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునే అధికారులు ఎవరూ తమ సొంత జిల్లాల్లో పనిచేయకుండా చూడాలని ఆదేశించింది.

గత నాలుగేండ్ల కాలంలో మూడేండ్లు ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని, 2024 జనవరి 31 నాటికి మూడేండ్లు పూర్తి చేసుకోబోతున్న వారిని సైతం బదిలీ చేయాలని సూచించింది.  వచ్చే జూలై 31వ తేదీ లోపు బదిలీల ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ ఏదైనా కారణం చేత బదిలీ చేయడం కష్టమైతే అందుకు కారణాన్ని సీఈవో ద్వారా తెలియజేస్తే అవసరమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలిపింది.

ఎన్నికల విధుల్లో భాగమయ్యే అధికారులు తమకు అభ్యర్థులు, రాజకీయ నేతలతో ఎలాంటి దగ్గరి బంధుత్వం లేదని, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీకి రెండు రోజుల ముందు లోగా డిక్లరేషన్‌ సమర్పించాలని ఆదేశించింది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది.