రాజద్రోహం సెక్షన్ కొనసాగాల్సిందే.. శిక్ష కూడా పెరగాలి

రాజద్రోహాన్ని నేరంగా పరిగణించడం కొనసాగించాలని, అంతేకాకుండా శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని, అయితే కొన్ని సవరణలు అవసరమని లా కమీషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 124ఏను కొన్ని సవరణలతో కొనసాగించాలని తెలిపింది. విశ్రాంత కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని కమిషన్ ఈ సిఫారసు చేసింది.

రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 124ఏను కొన్ని సవరణలతో కొనసాగించాలని, ఈ సెక్షన్ క్రింద నేరస్థులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని ప్రస్తుత నిబంధనలు చెప్తున్నాయని, మూడేళ్ల శిక్షను ఏడేళ్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి 22వ లా కమీషన్  సిఫారసు చేసింది.

భారత దేశ ఐక్యత, సార్వభౌమాధికారాలను పరిరక్షించడం కోసం ఇటువంటి చట్టం అవసరమని తెలిపింది. రాడికలైజేషన్‌ను ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. రాజద్రోహం అనేది వలస పాలకుల నుంచి వచ్చిన చట్టమని చెప్పడం దానిని రద్దు చేయడానికి తగిన కారణం కాదని స్పష్టం చేసింది.

రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే నిబంధనలు బ్రిటిష్ పాలనా కాలంలో వచ్చాయని, భారతదేశ స్వాతంత్ర్య సమర యోధులపై ఈ చట్టాన్ని ప్రయోగించారని చెప్తూ, దీనిని రద్దు చేయాలని కోరడం సరికాదని, దీనిని రద్దు చేయడానికి అవి సరైన కారణాలు కాదని తెలిపింది. ఆ మాటకు వస్తే మొత్తం భారతీయ న్యాయ వ్యవస్థకు వలస పాలన వారసత్వం ఉందని వివరించింది.

సెక్షన్ 124ఏ దుర్వినియోగమవుతోందనే అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ రితు రాజ్ అవస్థి న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌కు రాసిన కవరింగ్ లెటర్‌లో తెలిపారు. రాజద్రోహం నిబంధన దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ) సెక్షన్ 196(3)కి సారూప్యమైన నిబంధనను సీఆర్‌పీసీ సెక్షన్ 154లో చేర్చాలని సిఫారసు చేశారు. ఐపీసీ సెక్షన్ 124ఏ క్రింద నేరానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ దాఖలుకు ముందు అవసరమైన విధానపరమైన రక్షణ కోసం ఇటువంటి నిబంధనను చేర్చాలని తెలిపారు.

ఐపీసీ సెక్షన్ 124ఏ చాలా విస్తృతమైనదని, దీని పరిధిలోకి వచ్చే నేరాలు ఇతర చట్టాల పరిధిలోకి రావని తెలిపింది. ఉదాహరణకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఎ), జాతీయ భద్రతా చట్టం వంటి చట్టాల ద్వారా ఐపీసీ సెక్షన్ 124ఏ క్రిందకు వచ్చే నేరాలపై విచారణ చేయడం సాధ్యం కాదని తెలిపింది.

సుప్రీంకోర్టు ఐపీసీ సెక్షన్ 124ఏ చెల్లుబాటుపై నిర్ణయం తీసుకోవడానికి బదులు దాని అమలును నిలిపివేసింది. 2022 మే 11న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ సెక్షన్ అమలును నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 124ఏను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం అంతకుముందు సుప్రీంకోర్టుకు చెప్పింది. రాజద్రోహం చట్టాన్ని సమీక్షించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఈ నివేదిక వచ్చింది.