తెలంగాణాలో ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్‌ ఆలయం

ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీ ఆలయం సిద్దిపేటలో నిర్మాణం కానున్నది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్‌ఫ్రాటెక్‌, సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నాయి.

3డీ ప్రింటింగ్‌ ఆర్కిటెక్చర్‌లో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెడుతుందని అ ప్సుజా ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ హరికృష్ణ జీడిపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోని చర్విత మెడోస్‌లో నిర్మించనున్న ఈ ఆలయం సంస్కృతి, ఆధునిక సాంకేతికత మేళవింపుతో పాటు మానవ సృజనాత్మక, నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.

ఈ భవనం 3,800 చదరపు అడుగుల వైశాల్యం, 30 అడుగుల ఎత్తులో మూడు భాగాలుగా ఉండనున్నది. అంతేకాదు, దేశీయంగా అభివృద్ధిచేసిన మెటీరియల్‌, సాఫ్ట్‌వేర్‌తో దీని నిర్మిస్తున్నారు. మూడు గర్భగుడులతో ఉండే ఈ ఆలయంలో ఒకటి గణేశుడికి, మిగిలిన రెండు శివ, పార్వతులకు ప్రత్యేకించారు.

గణేశుడి గుడి మోదకం, శివునికి చతురస్రాకారం, పార్వతి గుడి కమలం ఆకారంలో నిర్మిస్తున్నారు. మోదకం, కమ లం ఆకారాన్ని ఆన్‌సైట్‌లో డిజైన్‌ చేయడం చాలా సవాళ్లతో కూడిందని హరికృష్ణ తెలిపారు. ఆలయ వాస్తు పద్ధతుల ప్రకారం వినూత్నంగా వీటిని డిజైన్‌ చేసినట్టు ఆయన చెప్పారు. ఆలయం రెండో దశలో గోపురంతోపాటు కమలం నిర్మాణం చేయనున్నట్లు పేర్కొన్నారు.

చర్విత మెడోస్‌లో దేశంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్‌ బ్రిడ్జి ప్రోటోటైప్‌ నిర్మాణం తరువాత ఈ 3డీ-ప్రింటెడ్‌ ఆలయం రాష్ర్టానికి మరోసారి ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెడుతుందని చెప్పారు. 3డీ ప్రింటెడ్‌ నిర్మాణంలో ఇదో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదొక అపూర్వమైన 3డీ-ప్రింటెడ్‌ నిర్మాణమే కాకుండా సింప్లిఫోర్జ్‌ బృందం అభివృద్ధి చేసిన రోబోటిక్‌ ఆర్మ్‌ సిస్టమ్‌ యొక్క నిర్మాణ శైలిని, సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని హరికృష్ణ వివరించారు.