బ్రిజ్ భూషణ్ అరెస్టుకు ఆధారాల్లేవు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్లుఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, ఆయనను అరెస్టు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఢిల్లీ పోలీసులు బుధవారం స్పష్టం చేశారు. రాజ‌కీయ‌వేత్త‌ను అరెస్టు కోసం వారెంట్ జారీ చేయాల‌న్నా.. స‌రైన ఆధారాలు లేవ‌ని పోలీసులు చెబుతున్నారు.

ఢిల్లీ పోలీసులు 15 రోజులలో కోర్టుకు తమ నివేదిక సమర్పిస్తారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో డబ్లుఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ అరెస్టుకు తగిన ఆధారాలు లభించలేదని, మహిళా రెజ్లర్లు కూడా తమ ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించలేకపోయారని ఆ అధికారి చెప్పారు.

ఢిల్లీ పోలీసులు 15 రోజుల్లో తమ నివేదికను చార్జిషీట్ రూపంలో లేదా తుది నివేదిక రూపంలో కోర్టుకు సమర్పిస్తారని ఆయన చెప్పారు. ఈ కేసును ఇంకా విచారిస్తున్నామ‌ని పోలీసులు త‌మ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 22 నుంచి మహిళా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియచేస్తున్నారు. పార్లమెంట్ భవనం వైపు ఊరేగింపుగా వెళ్లడానికి ప్రయత్నించిన రెజ్లర్లను జంతర్ మంతర్ నుంచి ఢిల్లీ పోలీసులు అదివారం తొలగించారు.

మరోవంక, తనపై ఆరోపణలు రుజువైతే తనకు తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బుధవారం ప్రకటించారు. తనపై వచ్చిన ఒక్క ఆరోపణ రుజువైనా ఉరివేసుకుని చనిపోతానని ఆయన స్పష్టం చేశారు.  మహిళా రెజ్లర్లపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాలంటూ ఆయన నిరసన తెలియజేస్తున్న రెజ్లర్లకు సవాలు విసిరారు.

ఎటువంటి శిక్షకైనా తాను సిద్ధమేనని ఆయన చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోనందుకు నిరసనగా తమ పతకాలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దేశానికి చెందిన అగ్ర రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగట్ మంగళవారం హరిద్వార్‌కు వెళ్లిన నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ నుంచి బుధవారం ఈ స్పందన వ్యక్తమైంది. రైతు నేత న‌రేశ్ టికాయ‌త్ అడ్డుకోవ‌డంతో ఆ కార్య‌క్ర‌మాన్ని రెజ్లర్లు విర‌మించారు.