ప్రధాని హాత్య కుట్రలోదక్షిణ కన్నడలో ఎన్ఐఏ సోదాలు

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో పలు చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బుధవారం సోదాలు నిర్వహిస్తోంది. 2022 జూలైలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాట్నాలో పర్యటించినపుడు ఆయనను హత్య చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కుట్ర పన్నినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా మొత్తం 16 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి.

పుత్తూరు, కుర్మడ్క, తరిపడ్పు, కుంబ్ర గ్రామాలకు చెందిన మహమ్మద్ హారిస్ కుంబ్ర, సజ్జద్ హుస్సేన్ కొడింబడి, ఫైజల్ అహ్మద్ తరిగుడ్డే, షంషుద్దీన్ కుర్నడ్కలను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

పీఎఫ్ఐ సభ్యుడు షఫీక్ పయెత్‌పై గత ఏడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన రిమాండ్ నోట్‌లో, 2022 జూలై 12న ప్రధాని మోదీ పాట్నాలో పర్యటించినపుడు ఆయనను హత్య చేయాలని పీఎఫ్ఐ కుట్ర పన్నినట్లు ఆరోపించింది. పీఎఫ్ఐ టెర్రర్ మాడ్యూల్స్‌ను తయారు చేస్తోందని, దాడులు చేయడానికి సన్నాహాలు చేస్తోందని తెలిపింది.

స్థానిక పోలీసుల సహకారంతో ఎన్ఐఏ అధికారులు 16 చోట్ల సోదాలు జరుపుతున్నారు. నిషేధిత పీఎఫ్ఐ కార్యకర్తలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రుల్లో డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్నారు. మంగళూరు, పుత్తూరు, బెల్టంగడీ, ఉప్పినంగడీ, వేనూర్, బంట్వాల్ సహా మొత్తం 16 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.

గల్ఫ్ దేశాల నుంచి హవాలా నెట్‌వర్క్ ద్వారా పీఎఫ్ఐకి నిధులు వస్తున్నాయని, దేశంలో ఉగ్రవాద దాడులకు వీరు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది. 2022లో ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో నిర్వహించిన సోదాల అనంతరం పాట్నాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.  వీరు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. వీరు నేరం చేసినట్లు ఆరోపించదగిన పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. 2047 నాటికి పీఎఫ్ఐ లక్ష్యాలకు సంబంధించిన పత్రాలు కూడా వీటిలో ఉన్నాయి.