6 పథకాలతో టిడిపి తొలిదశ మేనిఫెస్టో

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా 2024 ఎన్నికలకోసం సంవత్సరం ముందుగానే తొలిదశ మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇందులో ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించారు.  `భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఆరు పథకాలను వెల్లడించారు.  రాజమహేంద్రవరం రెండు రోజులపాటు జరిగిన మహానాడులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన వీటిని సంబంధించిన వివరాలు తెలియజేశారు. మహాశక్తి పథకం కింద నాలుగు పథకాలను ప్రకటించారు.
 
ఇందులో ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేల ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం కింద చదువుకుంటును పిల్లల తల్లులకురూ.15 వేలు ఇస్తామని తెలిపారు. పిల్లలు ఎంతమంది ఉన్నా  అందిస్తామని హామీ ఇచ్చారు.
దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.
ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ప్రతి మహిళనూ మహాశక్తిగా మారుస్తామని పేర్కొన్నారు.  జగన్‌ పాలనలో యువత భవిష్యత్‌ దెబ్బతిందని, వారికి దారి చూపే బాధ్యత టిడిపి తీసుకోవాల్సింది ఉందని పేర్కొంటూ యువగళం పథకం కింద నిరుద్యోగ యువతకు యువగళం నిధి పేరుతో నెలకు రూ.3 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని పేర్కొన్నారు.
 
అన్నదాత పథకం కింద రైతులను ఆదుకునేందుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించాయిరు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇస్తామని తెలిపారు.
 
టిడిపికి వెనొముకగా ఉన్న బిసిలకు రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. పూర్‌ టు రిచ్‌ పథకం కింద పేదలను సంపనుులుగా చేస్తామని, వారి ఆదాయం రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రయివేట్‌, ప్రజలు (పిపిపి) విధానంలో దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. దసరా నాటికి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు.