పాక్‌లో ఆత్మాహుతి దాడిలో ఇద్దరు మృతి

ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న వాయువ్య పాకిస్థాన్ గిరిజన జిల్లాలో శనివారం మోటారు సైకిల్‌పై పేలుడు పదార్థాన్ని కట్టుకుని వచ్చిన ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. పాక్‌లోని ఖైబర్‌ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాల కాన్వాయ్‌ను లక్ష్యంగా ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు.
 
దాంతో పాకిస్థాన్ భద్రతా బలగాలకు చెందిన కనీసం 19 మంది గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. వారిలో ఇద్దరు మృతి చెందిన్నట్లు చెప్పారు.  ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా లోని  డేరా ఇస్మాయిల్ ఖాన్ నుంచి దక్షిణ వజీరిస్థాన్‌లోని ఆస్మాన్ మంజా ప్రాంతంకు వెళుతున్న భద్రతా బలగాల వాహనంపై ఆత్మాహుతి బాంబర్ దాడి చేశాడని బాంబ్ డిస్పోసల్ స్కాడ్ ఇన్‌ఛార్జీ ఇనాయతుల్లా టైగర్ తెలిపారు. ఆ మొత్తం ప్రాంతాన్ని దిగ్బంధించారు.
 
దాడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. ఇదిలా ఉండగా,  గత బుధవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని వజీరిస్తాన్‌లోని దత్తా ఖేల్ బజార్‌లోని భద్రతా తనిఖీ కేంద్రం లక్ష్యంగా ఆత్మాహుతి బాంబర్‌ దాడి చేయగా, ఇద్దరు సైనికులతో సహా నలుగురు వ్యక్తులు మరణించారు.
ఈ దాడికి బాధ్యులమని ఇప్పటి వరకూ ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. పాకిస్థాన్‌లో ఇటీవల కాలంలో ఆత్మాహుతి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే రాష్ట్రంలో బుధవారం జరిగిన దాడిలో నలుగురు మరణించారు. జనవరి 30న పెషావర్‌లో ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది మరణించగా, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.