హైదరాబాద్, విశాఖలలో 35 చోట్ల ఐటీ దాడులు

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో మరోమారు ఐటి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖలలో నేడు ఐటి అధికారులు ఉదయం నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 20 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవంక విశాఖపట్టణంలో 15 చోట్ల జరుగుతున్నాయి.

కోహినూర్ డెవలపర్స్ సంస్థతో పాటుగా రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో కూడా తనిఖీలను కొనసాగిస్తున్నారు. కోహినూర్ డెవలపర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి మజీద్ తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొండాపూర్, మాదన్నపేట, మెహదీపట్నం, శాస్త్రిపురం తో పాటు పలు ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి.

మాదన్నపేట్ రామచంద్ర నగర్ లోని కోహినూర్ డెవలపర్స్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు.ఆదాయానికి సంబంధించిన అనేక వివరాలను కూపీ లాగుతున్నారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాలలో కోహినూర్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా పలు భూములలో కోహినూర్ గ్రూప్ వెంచర్లు కూడా వేసి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తోంది.

ప్రభుత్వం భూముల్లో ఈ కంపెనీ వెంచర్లు వేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ వెనుక ఒక రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లుగా ఐటి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతను ఎవరు అన్నది రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి కరంగా చర్చనీయాంశంగా మారింది.

ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని కోహినూర్ డెవలపర్స్ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈరోజు ఏకకాలంలో 20 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.రియల్ ఎస్టేట్, ఫార్మా, ఇన్ఫ్రా కంపెనీలపై ఇటీవల కాలంలో వరుసగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే విశాఖలో 15 ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. విశాఖలో ఏకకాలంలో 10 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు ఫార్మా కంపెనీలలో, వాటి డైరెక్టర్ ల ఇళ్ళలో ఏకకాలంలో తనిఖీలు జరుపుతున్నారు.