లాభాల బాటలో ఎయిర్‌పోర్టు ఆథారిటీ

ప్రభుత్వ రంగంలోని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కరోనా తరువాత మొదటిసారిగా లాభాలను ఆర్జించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఏఏఐ రూ. 3,400 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాల్లో ఎయిర్‌పోర్టు అథారిటీ నష్టాలను ఎదుర్కొంది.  2020-21లో సంస్థ రూ. 3,176.12 కోట్ల నష్టాలను నమోదు చేసింది.
2021-22 ఆర్ధిక సంవత్సరంలో రూ.  803.72 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతోనే ఎయిర్‌పోర్టు అథారిటీ లాభాల్లోకి వచ్చేందుకు దోహదం చేసింది.  2022లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 47.05 శాతం పెరిగి 12.32 కోట్లుగా నమోదైంది.
అంతకుముందు సంవత్సరం ఈ సంఖ్య 8.38 కోట్లుగా ఉంది.  2023వ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 51.70 శాతం పెరిగి 3.75 కోట్లుగా నమోదైంది.  2022లో ఇదే కాలంలో ప్రయాణికుల సంఖ్య 2.47కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన 2022 ఆర్ధిక సంవత్సరంలో తప్పనిసరిగా చెల్లించే డివిడెండ్‌రు ఏఏఐ విజ్జప్తి మేరకు రద్దు చేసింది. ఏయిర్‌ ఇండియా నష్టాల్లో ఉన్నందున రద్దు చేయాలని కోరింది.
 
టాటా గ్రూప్‌కు ఎయిర్‌ ఇండియాను విక్రయించడానికి ముందే ప్రభుత్వం ఏఏఐ చెల్లించాల్సిన డివిడెండ్‌ను రద్దు చేసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా దేశంలో 137 ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది.  ఇందులో 24 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 80 దేశీయ విమానాశ్రయాలు ఉన్నాయి. దీంతో పాటు అన్ని ఎయిర్‌పోర్టులోనూ, విమానయాన సంస్థలకు ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (ఏటీఎంఎస్‌) సేవలను అందిస్తోంది.