నోట్ల మార్పిడికి ఐడెంటిటీ ప్రూఫ్ అవసరం లేదు

 
ఒకసారి రూ.20వేల విలువైన (10 నోట్లు) రూ.2,000 నోట్లను డిపాజిట్ చేసేందుకు లేదా మార్పిడి చేసుకునేందుకు ఎలాంటి స్లిప్, ఫామ్, ఐడీ ప్రూఫ్ అవసరం లేదని  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.  సెప్టెంబర్ 30వ తేదీలోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, లేకపోతే బ్యాంకుల్లో రూ.2000 నోట్లు ఇచ్చి వేరే నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది.
 
మార్గదర్శకాల ప్రకారం, ఒకసారి 10 రూ.2,000 నోట్లను ఓ వ్యక్తి డిపాజిట్/ఎక్స్చేంజ్ చేయగలరు. మరిన్ని నోట్లు ఉంటే మళ్లీ వెళ్లాల్సి ఉంటుంది. రూ.2,000 నోట్లను డిపాజిట్/ఎక్స్చేంజ్ చేసుకునేందుకు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుందని, దానితో పాటు ఆధార్ లాంటి ఐటెంటిటీ డాక్యుమెంట్‍ను సమర్పించాల్సి ఉంటుందని కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉండడంతో ఎస్‍బీఐ ఈ స్పష్టత ఇచ్చింది.
 
రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్‌బీఐ గత శుక్రవారం ప్రకటించింది. అందుకే ప్రజలు సెప్టెంబర్ 30వ తేదీ లోగా రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ లేదా బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలని సూచించింది. ఎక్స్చేంజ్ కింద రూ.2,000 నోటును ఇచ్చి వేరే నోట్లను పొందవచ్చు. ఉపసంహరించుకుంటున్నా రూ.2,000 ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది.
 
అయితే, ప్రజలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సెప్టెంబర్ 30వ తేదీలోగా రూ.2,000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడమో, ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడమే చేయాలి. ఖాతాలేని బ్యాంకుకు కూడా వెళ్లి ప్రజలు రూ.2,000 నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
కాగా, రద్దుచేసిన కరెన్సీని డిపాజిట్‌గా తీసుకునేందుకు లేదా మార్చుకునేందుకు బ్యాంక్‌ శాఖ నిరాకరిస్తే ఖాతాదారు తొలుత సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించాలని ఆర్బీఐ సూచించింది. ఫిర్యాదు చేసిన తర్వాత 30 రోజుల్లోగా బ్యాంక్‌ స్పందన/పరిష్కారం సంతృప్తికరంగా లేకపోతే రిజర్వ్‌బ్యాంక్‌-ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ కింద ఆర్బీఐ పోర్టల్‌లోని కంప్లయింట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపింది.
 
ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల సేవలకు సంబంధించి ఖాతాదారుల వివాదాల్ని పరిష్కరించడానికే ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ ఉద్దేశించారు. ఆయా బ్యాంక్‌ల్లో ఖాతాలు లేనివారు కూడా ఏ బ్యాంక్‌ శాఖల్లోనైనా రూ.20,000 పరిమితివరకూ రూ.2000 నోట్లను మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.