అండమాన్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని వార్తలు వస్తున్న తరుణంలో బంగాళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలను నైరుతి రుతుపనాలు శుక్రవారం తాకినట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రతియేటా మే 18-19 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని, ఇప్పుడు కూడా సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని స్పష్టం చేసింది.

ఇక మే 22 నాటికి నైరుతి రుతుపనాలు మొత్తం అండమాన్ నికోబార్ దీవులను కప్పేస్తాయని ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా మే 18న రుతుపనాలు అండమాన్ దీవులను చేరుకుంటాయి. ఇప్పుడూ అదే జరిగింది. అంటే రుతపనాల కదలిక సాధారణంగానే ఉంది. మరో 3-4 రోజుల్లో రుతుపవనాలు అండమాన్ ను పూర్తిగా కప్పేయవచ్చని ఐఎండీ పేర్కొంది.

సాధారణంగా జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. గతేడాది మే 29నే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2020లో జూన్ 1, 2019లో జూన్ 8న రుతుపవనాలు కేరళకు చేరాయి. 2018లో మే 29నే తాకాయి. ఇక ఈ ఏడాది జూన్ 4న నైరుతి రుతుపనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.

ఈ ఏడాది దేశంపై ఎల్-నీనో ప్రభావం ఉంటుందని సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రుతుపవనాల కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ రంగానికి రుతుపనాలు చాలా కీలకం. 
ఒక్క మాటలో చెప్పాలంటే వర్షాలు బాగా కురిస్తే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది.

వర్షాలు పడకపోతే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాగా, ఆది, సోమవారాలలో ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. అసోం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వర్షాలు కురవచ్చని స్పష్టం చేసింది.

ఐఎండీ ప్రకారం పశ్చిమ్ బెంగాల్ లోని హిమాలయ ప్రాంతాల్లో ఈ నెల 22, 23 తేదీల్లో భారీ వర్షాలు పడతాయి. పశ్చిమ్ బెంగాల్ లోని గంగా నది తీర ప్రాంతం, ఒడిశాలో వర్షాలు పడతాయి. ఛత్తీస్ గఢ్ లో మరో 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.