రాబోయే ఐదేళ్లలో మరింత అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు

రాబోయే ఐదేళ్లలో ఇప్పుడున్న ఉష్ణోగ్రతల కన్నా.. అత్యధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని బుధవారం ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 2023-27 సంవత్సరాల మధ్యకాలంలో గ్రీన్‌ హౌస్‌ వాయువులు, ఎల్‌నినో కలిసిపోయి అత్యధిక ఉష్ణోగ్రతలకు దారితీసే అవకాశముందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

2015 పారిస్‌లో కుదుర్చుకున్న వాతావర ఒప్పంద లక్ష్యాలను రాబోయే రోజుల్లో ప్రపంచ ఉష్ణోగ్రతలు అధిగమించనున్నాయని, వచ్చే ఐదేళ్లలో మూడింట రెండు వంతులు అలా జరిగే అవకాశముందని ఐక్యరాజ్యసమితి యొక్క ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.  2015 నుంచి 2022 వరకు గడిచిన ఎనిమిదేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

అయితే వాతావరణ మార్పుల వల్ల ఈ రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసి అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యుఎంఓ) వెల్లడించింది. కాగా, 2015 పారిస్‌ ఒప్పందం ప్రకారం 195 దేశాలు గ్లోబల్‌ వార్మింగ్‌ను రెండు డిగ్రీల సెల్సియస్‌కు దిగువన పరిమితం చేయాలని అంగీకరించాయి. అంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యేలా ఆయా దేశాలు చర్యలు చేపట్టాలని ఈ ఒప్పందంపై సంతకం చేశాయి.

అయితే పారిస్‌ ఒప్పంద లక్ష్యాలను దాటి రాబోయే ఐదేళ్లలో 1.5 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని డబ్య్లుఎంఓ అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి 66 శాతం ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి 1.5 సెల్సియస్‌ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయి.

ఇక ప్రతి ఐదు సంవత్సరాలకు 1.1 నుండి 1.8 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని డబ్ల్యుఎంఓ అంచనా వేసింది. ఇక అలాస్కా, దక్షిణాఫ్రికా, దక్షిణాసియా, ఆస్ట్రేలియాలో  కొన్ని ప్రాంతాలు మినహా దాదాపు అన్ని ప్రాంతాలలో 1991-2020ల సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు 2023వ సంవత్సరంలో నమోదవ్వనున్నాయని డబ్ల్యుఎంఓ తెలిపింది.