పుల్వామాలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

జమ్మూకశ్మీర్‌ పుల్వామాలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు, భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు ఆరు కిలోల ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని ఇష్ఫాక్‌ అహ్మద్‌ వానీ అని, పుల్వామాలోని అరిగ్రామ్‌ ప్రాంత వాసిగా గుర్తించారు.

కశ్మీరు జోన్ పోలీసులు ఓ ట్వీట్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న ఇష్ఫాక్ అహ్మద్ వనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను వెల్లడించిన వివరాల ఆధారంగా దాదాపు 5 కేజీల నుంచి 6 కేజీల వరకు బరువుగల ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి పుల్వామా జిల్లాలోని అరిగమ్‌లో నివసిస్తున్నాడు. ఇతనిపై పుల్వామా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రాజౌరీలోని కంది అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఉగ్రవాద దాడిలో ఐదుగురు భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఓ సైనికాధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులను శనివారం ఉదయం సైన్యం గుర్తించింది. ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టింది. మరో ఉగ్రవాది గాయపడి, పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

మూడు రోజుల నుంచి కంది అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు జరుపుతున్నాయి. అయితే ఉగ్రవాదులెవరూ కనిపించలేదని సైన్యం తెలిపింది. శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసినప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం రాజౌరీలోని 25 ఇన్‌ఫాంట్రీ డివిజన్‌ను సందర్శించారు. నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం సన్నద్ధతను పరిశీలించారు. అమరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో కూడా ఎంతో ధైర్యసాహసాలతో పని చేస్తున్నందుకు సైన్యాన్ని ప్రశంసించారు.

మరో వైపు భద్రతా బలగాలు ఉత్తర కశ్మీర్లో భద్రతను కట్టిదిట్టం చేశాయి. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు నిఘా కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు, పేలుడు పదార్థాలను ఒకచోటు నుంచి మరోచోటుకు మారకుండా నిరోధించేందుకు వివిధ చోట్ల ఏర్పాటు చేసిన చెక్‌పాయింట్ల వద్ద స్నిఫర్‌ డాగ్‌లు భద్రతా సిబ్బందికి సహాయం చేస్తున్నాయన్నారు.
 
ఇదిలా ఉండగా.. ఈ నెలాఖరులో టూరిజంపై జీ20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో కశ్మీర్‌లో జరుగనున్నది. గత ఐదురోజులుగా జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదాలను బలగాలు మట్టుబెట్టాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌కు చెందిన వారిగా గుర్తించారు.