తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ నిలిపివేత

రెండు రోజుల క్రితం విడుదలై దేశవ్యాప్తంగా విశేషంగా ప్రశంసలు అందుకుంటున్న ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను తమిళనాడులో నిలిపివేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాపై నిషేధం విధించనప్పటికీ చెన్నైలోని థియేటర్‌ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 13 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
 
అయితే ‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శన వల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో మల్టీప్లెక్స్‌లలోని ఇతర సినిమా షోలపై దీని ప్రభావం పడుతున్నదని, వాటి ఆదాయం పడిపోతున్నదని వాపోయారు. అందుకే ఈ సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని పలు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సంస్థలు మూవీల జాబితా నుంచి ‘ది కేరళ స్టోరీ’ని తొలగించాయి.
 
చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతో పాటు పలు ముఖ్య నగరాల్లో మల్టీప్లెక్స్‌లలో షోలు రద్దు చేశారు. ఈ సినిమాను నిషేధించాలని  కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరించాయి
 
కాగా, ‘ది కేరళ స్టోరీ’ సినిమాను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తాజాగా థియేటర్ యజమానులు నిర్ణయించారు. అయితే తమిళనాడులోని అధికార డీఎంకేతో సన్నిహిత సంబంధాలున్న రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ ఆ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ని చాలా వరకు డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నది. రాజకీయ వత్తిడుల కారణంగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
 
భారీ వసూళ్లతో దూసుకుపోతోంది

సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు రూ.8.03కోట్లు, రెండో రోజు రూ.11.22కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు రూ.20కోట్లు రాబట్టింది. మొదటిరోజుతో పోలిస్, రెండో రోజు 39.73శాతం వృద్ధిని కనబర్చింది. మే 5న వివిధ సంచలనాల  నడుమ విడుదలైన ఈ సినిమాకు భారీ స్పందన వస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలను చిత్ర విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సినిమా ఇప్పటివరకు రూ.19.25కోట్లు వసూలు చేసినట్టు ఆయన వెల్లడించారు. ‘ది కేరళ స్టోరీ’లో అదా శర్ , యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. గత కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో వివాదం తలెత్తింది.

మతం మారిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టినట్లు చూపించడం వివాదానికి తెర తీసింది. ఈ సినిమాపై ఇటీవలే ప్రధాని మోదీ కూడా స్పందిస్తూ ఉగ్రవాద పరిణామాలను బయటపెట్టిన కేరళ స్టోరీ సినిమాను ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు.