
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా జరిగిన పర్యావరణ నష్టాన్ని పునరుద్ధరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.447 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ సూచించింది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి ఒక నివేదికను సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న పర్యావరణ ఉల్లంఘనలపై మహ్మద్ హయతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ వచ్చే వారం విచారణ చేపట్టనుంది.
ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ సమర్పించిన నివేదికను పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. నివేదికలో పర్యావరణ పునరుద్ధరణ కోసం చేయాల్సిన ఖర్చుతో పాటు “ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్”, “ఏక్షన్ ప్లాన్” అమలు కోసం రానున్న మూడేళ్ల నుంచి ఐదేళ్లలో రూ.3,241 కోట్లు ఖర్చు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
పర్యావరణ పరిహారంగా, నియమాల ఉల్లంఘనకు జరిమానా కింద తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.227 కోట్లు వసూలు చేయాలని కూడా సూచించింది. ముహమ్మద్ హయతుద్దీన్ పిటీషన్‌పై 2020లో ఎన్జీటీ ఇచ్చిన తీర్పు మేరకు 840 పేజీలతో సిఫార్సులు, సూచనలు చేస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదికను రూపొందించింది.
ఆ నివేదిక ఎన్జీటీ తదుపరి విచారణలో కీలకం కానుంది. 2017 వరకు ఏలాంటి అనుమతులు లేకుండా రూ. 18 వేల కోట్ల విలువైన నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం కొనసాగించిందని కేంద్ర పర్యావరణ శాఖ నివేదికలో పేర్కొంది.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి