స్వలింగ సంపర్కం ఓ మానసిక రుగ్మత

 
* సంవర్ధిని న్యాస్ సర్వే 

స్వలింగ సంపర్కాన్ని ఒక మానసిక రుగ్మతగా వైద్యులు పరిగణిస్తున్నారని, స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన పక్షంలో సమాజంలో ఇది మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రేరేపిత మహిళా విభాగంకు చెందిన సంవర్ధిని న్యాస్ నిర్వహించిన సర్వేలో తేలింది.

ఆర్‌ఎస్‌ఎస్‌కు సమాంతరంగా ఏర్పడిన మహిళా విభాగం  రాష్ట్ర సేవిక సమితి సీనియర్ నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆధునిక వైద్య శాస్త్రం నుంచి ఆయుర్వేద వరకు 8 విభిన్న వైద్య విధానాలకు చెందిన 318 మంది మెడికల్ ప్రాక్టీషనర్ల నుంచి దేశవ్యాప్తంగా సేకరించిన స్పందనల ఆధారంగా ఈ సర్వేను నిర్వహించినట్లు వారు చెప్పారు.

స్వలింగ సంపర్కం ఒక రుగ్మతగా అల్లోపతి డాక్టర్లతోపాటు వివిధ వైద్య విధానాల వైద్యులలో దాదాపు 70 శాతం మంది తేల్చారని సంవర్ధిని న్యాస్ నిర్వహించిన సర్వే పేర్కొంది. స్వలింగ సంపర్కం ద్వారా లైంగిక వ్యాధులు సోకుతాయని 83 శాతం మంది వైద్యులు నిర్ధారించారని ఈ సర్వే పేర్కొంది.

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడం వల్ల లైంగిక వ్యాధులకు గురయ్యే రోగులను బాగు చేయడం అటుంచి ఇది సమాజంలో మరింత చేటు తీసుకువస్తుందని సర్వేలో తెలిపారు. అటువంటి మానసిక రుగ్మతతో బాధపడే గోగులకు కౌన్సిలింగ్ ద్వారా చికిత్స చేయడం మంచిదని సర్వేలో వైద్యులు అభిప్రాయపడ్డారు.

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలన్న డిమాండుపై నిర్ణయం తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవడం మంచిదని సర్వేలో మెజార్టీ వైద్యులు సిఫార్సు చేసినట్లు సంవర్ధిని న్యాస్ తెలిపింది. స్విలింగ సంపర్క తల్లితండ్రులు తమ పిల్లలను సక్రమంగా పెంచలేరని సర్వేలో ఇచ్చిన ప్రశ్నలకు 67 శాతానికి పైగా డాక్టర్లు అభిప్రాయపడినట్లు సమితి తెలిపింది.

స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపిన నేపథ్యంలో సంవర్ధిని న్యాస్ ఈ సర్వే నిర్వహించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని సర్వేలో పాల్గొన్న 57 శాతానికి పైగా డాక్టర్లు వ్యతిరేకించినట్లు సమితి పేర్కొంది.