కేసీఆర్‌ ను గద్దెదించే శక్తి బీజేపీకే

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ను గద్దెదించే శక్తిబీజేపీకే ఉందని బిజెపి చేరికల కమిటీ కన్వీనర్‌ , ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ను ఎదుర్కొగలదని తెలిపారు. గురువారం తన కమిటీ సభ్యులైన ఎమ్మెల్యే రఘునందనరావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వరరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డిలతో కలసి ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చలు జరిపారు.
 
ఇటీవలనే బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన వారిద్దరిని బీజేపీలో చేరమని ఆహ్వానించారు. అనంతరం ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 12మంది ఎమ్మెల్యేలను కేసీఆర్‌ చేర్చుకున్న విషయం గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీని ఖతం చేసే కార్యక్రమాన్ని కేసీఆర్‌ 2014నుంచే ప్రారంభించారని తెలిపారు.
 
కేసీఆర్‌కు తన అధికార, ధన బలంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లొంగదీసుకొని తమ పార్టీలో చేర్చుకునే శక్తి ఉందని పేర్కొన్నారు. అయితే ఎవరికీ లొంగకుడా నిలబడి కలబడే పార్టీ బీజేపీ ఒక్కటేనని స్పష్టం చేయడం ద్వారా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని  గద్దె దింపాడమే తన లక్ష్యంగా చెబుతున్న పొంగులేటి, జూపల్లిలకు బీజేపీ మాత్రమే అందుకు తగిన వేదికగా తేల్చిచెప్పారు.
 
బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేసిన పొంగులేటి కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలను సంఘటితం చేసి పోరాటం సాగిస్తున్నారని ఈటెల కొనియాడారు. పొంగులేటి లక్ష్యం, తమ పార్టీ లక్ష్యం కేసీఆర్‌ను గద్దెదించడమేనని పేర్కొన్నారు. పొంగులేటితో గతంలో తమందరికీ వ్యక్తిగతంగా సంబంధాలున్నందున ఆయను బీజేపీలోకి రావాలని ఆహ్వానించడానికి వచ్చామని తెలిపారు.
 
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలనను అంతమొందించాలని ప్రధాని మోదీ, అమిత్‌షాను ఆదేశించారని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను కలిసినట్లు ఈటెల ఈ సందర్భంగా తెలిపారు.

అయితే పొంగులేటి, జూపల్లి మాత్రం బీజేపీలో చేరికపై తమ కార్యకర్తలతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని ఈటల బృందంతో చెప్పినట్లు సమాచారం. బీజేపీలో చేరాలని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఇక జూపల్లి కృష్ణారావును గతంలోనే ఆహ్వానించారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి , డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలు జూపల్లి కృష్ణారావుకు ఫోన్ చేసి పార్టీలో చేరాలని కోరారు. తమ అనుచరులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తానని జూపల్లి గతంలో ప్రకటించారు.