ఏపీకి ఏపీ భవన్, తెలంగాణకు పటౌడి హౌస్‌

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లవుతున్నా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ప్రక్రియలో కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. 7.64 ఏకరాల్లో ఉన్న పటౌడి హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని, మిగిలిన 12.09 ఏకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది.
 
ఈ సూచనతో జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు దక్కాల్సినంత భూమి దాదాపుగా వస్తుందని, స్వల్పతేడాకు ఇవ్వాల్సిన మొత్తం కూడా చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సానుకూలత వ్యక్తం చేస్తూ ఆమోదయోగ్యంగా, సాధ్యపడేలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై పరిశీలించి తమ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేస్తామని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన అధికారులు ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతనే తెలియజేస్తామని చెప్పినట్టుగా తెలిసింది. ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీలు (కేంద్ర-రాష్ట్ర సంబంధాలు) సంజీవ్ కుమార్ జిందాల్, జి. పార్థసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ తమ ప్రతిపాదనలను అందజేశాయి.

కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం 12.09 ఏకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని తెలంగాణకు ఇచ్చి, పటౌడీ హౌజ్ (7.64 ఏకరాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. తెలంగాణకు దక్కాల్సిన వాటా కంటే అదనంగా ఇస్తున్న భూమికి తగిన విలువను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆ ప్రతిపాదనలో పేర్కొన్నట్టు సమాచారం.

మొత్తం స్థలం తమకే దక్కుతుందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్  వాదిస్తూ వస్తున్నారు. నాటి నైజాం రాజులు నిర్మించిన ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌజ్’ను కేంద్ర ప్రభుత్వం తీసుకుని, అందుకు ప్రతిఫలంగా ఇచ్చిన స్థలంలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించినందున తమకే మొత్తం స్థలాన్ని కేటాయించి, ఆంధ్రప్రదేశ్‌కు మరెక్కడైనా కొత్తగా స్థలాన్ని కేటాయించాలని సూచించింది.

కానీ విభజన చట్టం ప్రకారం ఇది సాధ్యం కాదని, రాష్ట్రం వెలుపలి ఉమ్మడి ఆస్తులను విభజన చట్టం ప్రకారం మాత్రమే పంచుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 66 ప్రకారం రాష్ట్రం వెలుపలి ఉమ్మడి ఆస్తుల విభజన కోసం జనాభా నిష్పత్తి (58:42) ప్రకారం పంచుకోవాల్సి ఉంటుంది.