చిక్కుల్లో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. తమ ఊరు చింతలమోరికి ఓ దొంగ ఓట్ల బ్యాచ్ వచ్చేదని, 15 నుంచి 20 మంది వరకు తలా 5 నుంచి 10 ఓట్లు వేసేవారని, తన విజయంలో దొంగ ఓట్ల పాత్ర కూడా ఉందని రాపాక చెప్పిన మాటలు గల వీడియో వైరల్ కావడంతో ఆయనకు ముప్పుతెచ్చింది. ఇప్పుడా వీడియోలో చేసిన వ్యాఖ్యలు రాపాక మెడకు చుట్టుకున్నాయి.

ఈ వ్యాఖ్యలపై సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన వెంకటపతిరాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గత నెల 24న ఈ-మెయిల్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఎన్నికపై విచారణ నిర్వహించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. కాగా, ఈ వ్యవహారంపై విచారణ నిస్పక్షపాతంగా ఉండాలని వెంకటపతిరాజా కోరుతున్నారు.

తాను దొంగ ఓట్లతో విజయం సాధించానని ఒప్పుకున్నారని,  ఆయన ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. వెంటనే విచారణ చేసి కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికలలో రాష్ట్రంలో జనసేన నుండి గెలుపొందిన ఏకైక అభ్యర్థి రాపాక కాగా, ఆయన ఎన్నికల అనంతరం వైసీపీతో ఉంటున్నారు.

మార్చి 24న అంతర్వేదిలో జరిగిన వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన చేసిన వాఖ్యలో ఈ వీడియోలో వైరల్ అయ్యాయి. చింతలమోరిలోని తన ఇంటి సమీపంలో ఉండే ఓ పోలింగ్ బూత్ గురించి ప్రస్తావించారు. ఆ వీడియోలో వాఖ్యలు ప్రత్యర్థుల విమర్శలకు దారితీయడంతో తాను  ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల విషయాన్ని సరదాగా ప్రస్తావించినట్లు స్పష్టత ఇస్తూ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.