చిట్‌ ఫండ్స్‌ కేసులో టీడీపీ ఎమ్మెల్యే భర్త, మామ అరెస్ట్!

చిట్‌ ఫండ్స్‌ కేసులో టీడీపీ ఎమ్మెల్యే భర్త, మామ అరెస్ట్!
రాజమహేంద్రవరం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్, ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), ఆమె మామగారైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆదిరెడ్డి ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు తండ్రీ కుమారులను అదుపులోకి తీసుకుని వారిని స్థానిక సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
 
రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు జగత్‌జనని చిట్‌ఫండ్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగజ్జనని చిట్‌ఫండ్‌‌పై సీఐడీకి, కాకినాడ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులు వచ్చాయి.
దీంతో నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడ్డారని, చిట్స్‌ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్లు, ఫాల్స్‌ డిక్లరేషన్‌ను అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించారు.

మొత్తం 49 సబ్‌స్కైబర్‌ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలు ఇచ్చారు. డాక్యుమెంట్ల నిర్వహణలోనూ ఆక్రమాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చిట్‌ఫండ్స్ నిధులతో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించడంతో 1982 చిట్‌‌ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. దీంతో, జగజ్జనని చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్లు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అరెస్ట్‌ చేసింది.

 
కాగా, గతేడాది నవంబర్‌ నుంచి రాష్ట్రంలో చిట్‌ఫండ్‌ కంపెనీల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ తనిఖీలు చేపట్టింది. మార్చి 16న జగజ్జనని చిట్స్‌ సహా రాష్ట్రంలోని పలు చిట్‌ఫండ్‌ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సీఐడీకి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు.

అయితే, ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అరెస్ట్ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. మాజీ మంత్రి జవహర్‌, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహా నేతలు అక్కడికి చేరుకుని సీఐడీ చర్యలను తీవ్రంగా ఖండించారు.

 
కాగా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు  ఫోన్ చేసి అరెస్ట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. భవానికి చంద్రబాబు ఫోన్‌లో ధైర్యం చెప్పారు. ఆదిరెడ్డి ఆప్పారావు, శ్రీనివాస్ అరెస్టును ఖండిస్తూ వైసీపీ ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని మండిపడ్డారు. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు.