విషపు నాగునే… ఖర్గే విమర్శలకు ప్రధాని ధీటుగా కౌంటర్

 
“విషపు నాగు” అంటూ తనను విమర్శించిన కాంగ్రెస్  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీటుగా స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆ రాష్ట్రంలోని కొలార్‌ లో జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ ఖర్గే విమర్శలుకు దీటైన సమాధానం చెప్పారు.
 
పరమేశ్వరుని మెడలో హారం నాగుపాము అని, తన వరకూ ప్రజలే శివుళ్లనీ, నాగేంద్రుడిలా వారి వెన్నంటి ఉండేందుకు తాను సిద్ధమని చెప్పారు. కర్ణాటక పవిత్ర భూమి అని, ప్రజలే ఓటు ద్వారా కాంగ్రెస్‌కు గట్టి స్పందన తెలియజేస్తారనే విషయం తనకు తెలుసునని తెలిపారు.
 
‘‘దేశాన్ని బలంగా చేయడం కోసం, అవినీతి కూకటివేళ్లతో పెకిలించడానికి నా ప్రభుత్వం పని చేస్తుంది. కానీ అది కాంగ్రెస్‌కు రుచించడం లేదు. అందుకే వాళ్లు నన్ను విష సర్పం అని అంటున్నారు. ఇవాళ మీకో విషయం చెప్పాలని అనుకుంటున్నా. పరమేశ్వరుడి మెడలో హారంలా పాము ఉంటుంది. నా దృష్టిలో ఈ దేశ ప్రజలు ఆ పరమ శివుడితో సమానం. నేను వాళ్లతో ఉండే సర్పాన్ని. ప్రజలంతా నాకు దేవుళ్లు. కర్ణాటక ప్రజలు మే 13న కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే బదులిస్తారు’’ అని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్, జేడీయూ వేర్వేరుగా కనిపిస్తున్నా, రెండూ ఒకటేనని, రెండూ కుటుంబ పార్టీలేనని ప్రధాని విమర్శించారు. భారత్‌కు గ్రోత్ ఇంజన్ కర్ణాటక అని, అస్థిర ప్రభుత్వం ఏర్పడటం మంచిది కాదని సూచించారు. అస్థిర ప్రభుత్వం వల్ల అభివృద్ధి జరగదని, ప్రజలను లూటీ చేస్తారని ప్రధాని హెచ్చరించారు. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాలు ఉన్నప్పడు కొన్ని ప్రత్యేక కుటుంబాలే అభవృద్ధి చెందాయని ధ్వజమెత్తారు.
 
 బీజేపీకి మాత్రం ఈ దేశంలోని ప్రతి కుటుంబం సొంత కుటుంబమని ప్రధాని తెలిపారు. వంచనకు మారుపేరు కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. కర్ణాటకలో కింగ్‌మేకర్‌గా జేడీఎస్ చెప్పుకుంటుందని, జేడీఎస్‌కు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్‌కు వేసినట్టేనని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు, పేదల కోసం పాటుపడే పార్టీ బీజేపీ మాత్రమేనని, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో రైతులు ఎంతో లబ్ధి పొందారని చెప్పారు.
 
కాంగ్రెస్ 85 శాతం కమీషన్ పార్టీ అని ఆరోపించిన ప్రధాని మోదీ వాళ్ల సొంత ప్రధానే ఈ విషయాన్ని అంగీకరించారని గుర్తు చేశారు. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి తద్వారా రాష్ట్రానికి దోచుకోవడానికి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మోదీ హెచ్చరించారు.
 
రెండు రోజుల క్రితం కలబుర్గిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మల్లికార్జున ఖర్గే.. ప్రధాని మోదీని విష సర్పంతో పోల్చారు. ఒకవేళ విషాన్ని మీరు పరీక్షించాలని అనుకుంటే.. అది మీ మరణానికి దారి తీస్తుందని ఆయన ప్రజలను హెచ్చరించారు. ఖర్గే వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు.
 
తన కామెంట్లు ప్రధాని మోదీని ఉద్దేశించినవి కాదని, బీజేపీ భావజాలం విషపూరితమైందని తాను చెప్పానని పేర్కొన్నారు. ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా దాడి చేయలేదని అంటూ ఎవరైనా బీజేపీ భావజాలాన్ని తాకితే.. దాని విష ప్రభావంతో చనిపోతారని అన్నానని ఖర్గే వివరణ ఇచ్చారు.