నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా  అత్యాధునిక వసతులతో నిర్మించిన రాష్ట్ర పరిపాలనా సౌధం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యాన్నిముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. ఆ త‌ర్వాత‌ ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి.. సుముహూర్త సమయంలో కుర్చీలో ఆసీనులయ్యారు. అనంత‌రం ఆరు దస్త్రాలపై సంతకాలు చేశారు. అందులో మొట్టమొదటి సంతకాన్ని “పోడు భూముల”  దస్ర్తంపై సంతకం చేశారు. మంత్రులు కూడా తమ తమ చాంబర్స్ లలో బాధ్యతలు స్వీకరించారు.
 
తెలంగాణ ప‌రిపాల‌న‌కు గుండెకాయ‌గా, అత్యంత శోభాయ‌మానంగా నిర్మించిన స‌చివాల‌యం తన చేతుల మీదుగా ప్రారంభించ‌డం తన జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా జరిగిన సభలో చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన‌ప్పటి నుంచి ఇప్పటివరకు పదేళ్లలో తెలంగాణ‌లో ఎలాలంటి క‌ల్లోలాలు లేవని కేసీఆర్ తెలిపారు.
 
దీనికి కారణమైన పాత డీజీపీలు అనురాగ్ శ‌ర్మ, మ‌హేంద‌ర్ రెడ్డిల కృషిని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో శాంతి భ‌ద్రత‌ల‌కు పెద్దపీట వేస్తున్నామని.. భ‌రోసా కేంద్రాలు, షీ టీమ్స్‌తో అరాచ‌క ముఠాల‌ను నివారిస్తున్నామని చెప్పారు. అటు పారిశ్రామిక రంగంలో, ఇటు ఐటీ రంగంలో దూసుకుపోతున్నామని చెప్పిన కేసీఆర్ ఐటీ విధానంలో బెంగ‌ళూరును దాటి పోతున్నామని తెలిపారు.
 
“మురికి కూపాలుగా ఉన్న ప‌ట్టణాల‌ను అభివృద్ధి చేస్తున్నాం. డంపుయార్డుల‌ు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠదామాలు, పచ్చదనంతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. అండ‌ర్‌పాస్‌లు, ఫ్లై ఓవ‌ర్లు, లింక్ రోడ్లతో హైద‌రాబాద్.. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతోంది. యాదాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణం ప్రపంచానికే ఆద‌ర్శంగా నిలుస్తుంది. ఇదీ తెలంగాణ పునర్నిర్మాణం అంటే..” అని కేసీఆర్ వివరించారు.

“ప్రపంచంలో అభివృద్ధిని, పున‌ర్నిర్మాణాన్ని కొల‌మానంగా తీసుకునే సూచిక‌లు రెండే రెండు. ఒక‌టి తలసరి ఆదాయం. రెండోది తలసరి విద్యుత్ వినియోగం. ఇవి నిజ‌మైన అభివృద్ధి సంకేతాలు. చాలా విషయాల్లో మనం దేశంలోనే ముందున్నాం. తెలంగాణ వ‌చ్చిన నాటి నుంచి ఇప్పటి దాకా ఆర్థిక క్రమ‌శిక్షణతో తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నాం. విద్యుత్ వినియోగంలో 2,140 యూనిట్లతో దేశంలోనే అగ్రభాగాన ఉన్నాం.” అని తెలిపిన కేసీఆర్  స‌చివాల‌యం నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినంద‌న‌లు తెలిపారు.