శ్రీరాముడి వనవాస మార్గంలో ‘వందే భారత్’ రైలు

శ్రీరాముడు సతి సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్లిన మార్గంగా భక్తులు విశ్వసించే రూట్ లో వందే భారత్ రైలును ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా సిద్ధమైంది.  ఈ వందే భారత్ రైలును యూపీ రాజధాని లక్నో నుంచి ప్రయాగరాజ్, అయోధ్యల మీదుగా చిత్రకూట్  వరకు నడపనున్నారు.
 
ఈ ప్రయాణ మార్గాన్ని బీజేపీ ఫూల్పూర్ ఎంపీ కేసరి దేవి పటేల్ ప్రతిపాదించారు. ఈ మార్గాన్ని రైల్వే శాఖ కూడా ఆమోదించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ మార్గంలో వందే భారత్ సెమీ హై స్పీడ్ రైలును ప్రారంభించడం వల్ల భక్తి పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, యూపీలోని రెండు ప్రధాన నగరాలైన లక్నో, ప్రయాగరాజ్ ల మధ్య వందే భారత్ ను ప్రారంభించినట్లవుతుందని కూడా భావిస్తున్నారు.

రామాయణం ప్రకారం సాధారణంగా శ్రీరాముడి వనవాస మార్గాన్ని అయోధ్య నుంచి శ్రీలంక వరకు సీతామాత, లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు నడిచిన మార్గాన్ని శ్రీరాముడి వనవాస మార్గంగా భావిస్తారు. కానీ యూపీలో అయోధ్య నుంచి ప్రయాగరాజ్ లోని శ్రీవెంగపూర్ మీదుగా చిత్ర కూట్ వరకు శ్రీరాముడు నడిచాడని విశ్వసిస్తారు.

ఈ మార్గంలో వెళ్తున్న సమయంలోనే శ్రీరాముడి జీవితంలో ఎన్నో ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయని విశ్వసిస్తారు. అందువల్ల ఆ మార్గంలో వందే భారత్ రైలును ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 వందే భారత్  రైళ్లు నడుస్తున్నాయి. 2023 చివరి నాటికి వాటి సంఖ్యను 75 కి పెంచుతామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు.

ఈ ప్రతిపాదిత వందే భారత్ రైళ్ల మార్గాలను రైల్వే శాఖ పరిశీలిస్తోందని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాగరాజ్ – లక్నో – గోరఖ్ పూర్ మార్గంలో కూడా ఒక వందే భారత్ ను ప్రారంభించాన్న ప్రతిపాదన రైల్వే శాఖ వద్ద ఉంది.