మోదీతో  సైద్దాంతిక విభేదాల్లేవు 

 
ప్రధాని నరేంద్ర మోదీతో తనకు సైద్దాంతిక విభేదాల్లేవని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు స్పష్టం చేసారు. రిపబ్లిక్ టివి నిర్వహించిన `రిపబ్లిక్ సమ్మిట్’లో పాల్గొంటూ గతంలో కేవలం ప్రత్యేక హోదా సెంటిమెంట్ విషయంలో ఎన్డీయే నుండి బైటకు రావలసి వచ్చిందని తెలిపారు.
గతంలో ఎన్‌డీఏలో ఉన్నప్పుడు కూడా ప్రధాని మోదీతో తమకు విధానపరమైన విభేదాలేవీ లేవని గుర్తు చేసారు.
రాజకీయాలు వేరు.. దేశం వేరని చెబుతూ  ప్రపంచంలో భారతదేశాన్ని ప్రధాని మోదీ బాగా ప్రమోట్‌ చేస్తున్నారని ప్రశంసించారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న విజన్ 2047 కి మద్దతిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి ప్రపంచంలో అగ్రగామిగా మన దేశాన్ని నిలపాలని ఆయన అనుకుంటున్నారని గుర్తు చేశారు. దేశాభివృద్ధి కోణంలో ఆయన విధానాలకు ఒక భారత పౌరుడిగా మద్దతిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు.
 
భారత జాతి అభ్యున్నతికి ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. అయితే, తిరిగి ఎన్డీయేలో చేరతారా అని ప్రశ్నించినప్పుడు రాజకీయంగా ఎవరు ఎవరితో కలుస్తారనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని, ఊహాజనిత ప్రశ్నలకు తానిప్పుడు సమాధానం చెప్పనని స్పష్టం చేశారు.
 
తనకు అధికారం ముఖ్యం కాదని చెబుతూ  వాజపేయి తమ పార్టీకి తన మంత్రివర్గంలో 7-8 మంత్రి పదవులు ఇస్తామన్నా తాము తీసుకోలేదని గుర్తు చేశారు. దేశం విషయంలో రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు.”ఎక్కడ అభివృద్ధి ఉన్నా మేం కలుస్తాం… మద్దతిస్తాము” అని చంద్రబాబు తెలిపారు.
 
తొలుత విమర్శలు వచ్చినా ఇప్పుడు జీఎస్టీ పన్నుల వలన పన్నుల ఎగవేత తగ్గుతోందని, ఆదాయం పెరుగుతోంద చంద్రబాబు పేర్కొన్నారు. దీనితోపాటు అవినీతి తగ్గించాలి. రూ.500, అంతకుపైన ఉన్న కరెన్సీ నోట్లు రద్దు చేయాలని ఆయన సూచించారు. దీనివల్ల రాజకీయ అవినీతి తగ్గుతుందని పేర్కొన్నారు. రాజకీయ అవినీతి, ఓటర్లకు డబ్బు పంపిణీ నిరోధించగలిగితే దేశం ఇంకా ముందుకు వెళ్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.