కేజ్రీవాల్ ఇంటి సుందరీకరణకు రూ.45 కోట్లు

ఆమ్ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య మరో రాజకీయ దుమారం చెలరేగింది. తన ఇంటి పునరుద్ధరణ, సుందరీకరణ పనుల కోసం రూ.45 కోట్ల ప్రజాధనాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వాడుకున్నారని బీజేపీ ఆరోపించింది. నిజాయితీ, సింప్లిసిటీ అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ తన వాగ్దానాలను తప్పుతున్నారని, మోసం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు.
కంఫర్ట్, విలాసాలపై ఆయనకు కాంక్ష ఎక్కువ అని పేర్కొన్నారు. తన ఇంటి సుందరీకరణ గురించిన వార్తను కప్పిపుచ్చేందుకు మీడియా సంస్థలకు రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించారని, అయితే దాన్ని ఆ సంస్థలు అంగీకరించలేదని పాత్రా ఆరోపించారు. కేజ్రీవాల్ ఇంటికి వియత్నాం నుంచి ఖరీదైన మార్బుల్స్, ప్రీ-ఫాబ్రికేటెడ్ ఉడెన్ వాల్స్, కర్టన్లు తెప్పించారని సంబిత్ పాత్రా వెల్లడించారు.
ఈ ఒక్కో కర్టన్ ధర రూ.7.94లక్షల కంటే ఎక్కువని ఆయన ఆరోపించారు. “ఆయన సిగ్గులేని ఓ రాజు కథ ఇది” అంటూ సంబిత్ పాత్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన ఇంటి సుందరీకరణ గురించి సంధిస్తున్న ప్రతీ ప్రశ్నకు కేజ్రీవాల్ సమాధానం చెప్పాల్సిందేనని సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ విద్యార్హతపై ప్రశ్నించేందుకు మీడియా సమావేశం పెట్టినట్టే, తన ఇంటిపై వస్తున్న ఆరోపణల గురించి కూడా ప్రెస్ మీట్ పెట్టి జవాబు చెప్పాలని సంబిత్ పాత్రా స్పష్టం చేశారు.

ఈ విమర్శలకు ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పందిస్తూ “డొనాల్డ్ ట్రంప్ 3 గంటల పర్యటనకు రూ.80కోట్లు ఖర్చు చేశారు. మధ్యప్రదేశ్, గుజరాత్ ముఖ్యమంత్రులు.. విమానాల కోసం రూ.200 కోట్లు కేటాయించుకున్నారు. ఈ విషయాలపై చర్చించేందుకు ఎవరికీ ధైర్యం లేదు” అంటూ ఎదురు దాడి చేశారు.

కేజ్రీవాల్ ప్రస్తుతం ఉంటున్న బంగ్లా 1942లో నిర్మితమైందని, అది శిథిలావస్థలో ఉందని ఆమె చెప్పారు. ఓసారి కేజ్రీవాల్ తల్లిదండ్రులు ఉంటున్న గది పైకప్పు స్లాబ్ ఊడిపోయిందని అంటూ  ఇంట్లో పైకప్పు స్లాబ్ మూడుసార్లు కూలిపోయిందని ఆమె తెలిపారు. ఇంటికి మరమ్మతులు చేయాలని పీడబ్ల్యూడీనే చెప్పిందని ఆమె స్పష్టం చేశారు. పైగా,  ఢిల్లీ సీఎం ఇంటి నిర్మాణ విలువ కంటే ఆరు ఎకరాల్లో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ నివాస మరమ్మతులు/పెయింటింగ్‍కే ఎక్కువ ఖర్చయిందని ఆమె ఆరోపించారు.