కేరళలో ప్రధాని మోదీకి ఆత్మాహుతి బాంబు బెదిరింపు

ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆత్మాహుతి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 24, 25 తేదీలలో ప్రధాని మోదీ కేరళను సందర్శించనున్న నేపథ్యంలో ఆయనను ఆత్మాహుతి ద్వారా చంపేస్తామంటూ బెదిరింపు లేఖ రావడంతో పోలీసులు, భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బిజెపి కేరళ శాఖ అధ్యక్షుడు కె సురేంద్రన్‌కు పార్టీ కార్యాలయంలో ఒక అపరిచిత వ్యక్తి పంపిన బెదిరింపు లేఖను ఈ నెల 17న అందుకున్నారు.

దుండగులు మలయాళంలో లేఖ రాశారు. ఎర్నాకులం వాసి జానీ నడుముత్తమిల్ పేరుతో ఈ లేఖ రావడం గమనార్హం. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రధాని మోదీ ఈ నెల 24, 25 తేదీలలో కేరళను సందర్శించనున్నారు. వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు.

తిరువనంతపురం నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ప్రారంభిస్తారు. వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కోచ్చిలో రోడ్‌షోలో పాల్గొంటారు. కొత్తగా ప్రారంభిస్తున్న సెమీ హైస్పీడ్ రైలులో ఆయన ప్రయాణిస్తారు. అంతేకాకుండా బీజేపీ యువజన సంఘాలు నిర్వహించే ‘యువం’ అనే సమావేశంలోనూ పాల్గొంటారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)ను నిషేధించిన తర్వాత మొదటిసారి ప్రధాని మోదీ  కేరళను సందర్శించనున్న నేపథ్యంలో ఆయనకు వచ్చిన బాంబు బెదిరింపును పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు పెంచారు. నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరిన్ని వివరాలను సేకరిస్తున్నాయి.

మరోవైపు సెక్యూరిటీ డ్రిల్స్ కు సంబంధించి ఏడీజీపీ జారీ చేసిన లెటర్ మీడియాలో లీక్ అయింది. అందులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సహా పలు ముప్పులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేరళకు చెందిన బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి ఎం.మురళీధరన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడీజీపీ లేఖ లీక్ కావడం.. తీవ్రమైన భద్రతా లోపమని విమర్శించారు. షెడ్యూల్ ప్రకారమే ప్రధాన మంత్రి పర్యటన కొనసాగుతుందని తెలిపారు.