పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వంపై అమిత్ షా ప్రశంస

ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ పైనా, ఆ సంస్థపైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వంను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇటీవలే అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ కూడా ఇదే విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ ను ప్రశంసించారు.

‘ఇండియా టుడే’ నిర్వహించిన కర్ణాటక రౌండ్‌టేబుల్, 2023లో శనివారం అమిత్ షా మాట్లాడుతూ, అమృత్‌పాల్ సింగ్‌పైనా, ఆయన నడుపుతున్న సంస్థపైనా పంజాబ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తోందని పేర్కొన్నారు.

 పంజాబ్‌లో ఖలిస్థానీ భావాల ప్రభావం లేదని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితిని తాము చాలా నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. భారత దేశ ఐక్యత, సార్వభౌమాధికారాలపై ఎవరూ దాడి చేయలేరని అమిత్ షా భరోసా ఇచ్ఛారు. పాల్ అరెస్ట్‌ ఎప్పుడో ఒకప్పుడు జరగవచ్చునని చెప్పారు. గతంలో ఆయన స్వేచ్ఛగా సంచరించగలిగేవాడని, ఇప్పుడు తన కార్యకలాపాలను నిర్వహించలేకపోతున్నాడని గుర్తు చేశారు.

ఇండియన్ హై కమిషన్ కార్యాలయాలపై దాడులు జరిగితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీ గడ్డపై నుంచి కుట్ర జరిగినపుడు దర్యాప్తు చేసే సమర్థత ఎన్‌ఐఏకు ఉందని, ఆ సంస్థను ఆ స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పారు.

లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై జరిగిన దాడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తును ప్రారంభించారని చెప్పారు. ఇండియన్ హై కమిషన్ నుంచి కూడా నివేదిక వచ్చిందని తెలిపారు. దీని ఆధారంగా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏకు అప్పగించినట్లు వెల్లడించాయిరు.

పంజాబ్ ప్రభుత్వం మార్చి 18 నుంచి అమృత్‌పాల్‌పైనా, ఆయన నడుపుతున్న సంస్థ సభ్యులపైనా పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. ఆయనకు సన్నిహితంగా వ్యవహరించేవారిలో చాలా మందిని అరెస్ట్ చేసింది. ఆయన భార్య కిరణ్‌దీప్ కౌర్‌ లండన్ వెళ్లేందుకు ప్రయత్నించినపుడు గురువారం అమృత్‌సర్ విమానాశ్రయంలో పంజాబ్ పోలీసులు నిలిపేశారు.

లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై మార్చి 19న ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అమృత్‌పాల్ సింగ్ పోస్టర్లతో వీరంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కర్ణాటకలో బీజేపీ విజయం తధ్యం
 
కాగా, కర్ణాటకలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కొందరు సీనియర్ నాయకులకు పార్టీ సీట్లు ఇవ్వకపోవడం గురించి ప్రస్తావిస్తూ వారంతా గౌరవనీయమైన నాయకులని, అయితే పలు కారణాల దృష్ట్యా, నూతన నాయకత్వంను ప్రోత్సహించడం కోసం మార్పులు చేయాల్సి వచ్చిందని తెలిపారు.
 
అయితే కాంగ్రెస్ లో గతంలో రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో వీరేంద్ర పాటిల్ ను అధికారం నుండి దించినట్లు అకస్మాత్తుగా చేయలేదని, అన్ని అంశాలను లోతుగా, సవివరంగా చర్చించి, వివరించి మార్పులు తెచ్చామని వివరించారు.
 
కాగా, కర్ణాటకలో జేడిఎస్ కు ఓటు వేయడం అంటే కాంగ్రెస్ కు వేసిన్నట్లే అని అమిత్ షా స్పష్టం చేశారు. గత రెండు ఎన్నికలలో కర్ణాటక ప్రజలు బిజెపిని అతిపెద్ద పార్టీగా ఎన్నుకొంటూ రాగా, కాంగ్రెస్ ను రెండో పెద్ద పార్టీగా, జేడీఎస్ ను మూడో పార్టీగా ఎన్నుకొంటూ వచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఎన్నికలు కాగానే జేడీఎస్ కాంగ్రెస్ తో చేతులు కలుగుతుండటం చూశామని గుర్తు చేశారు.