కరోనాతో క్వారంటైన్ లోకి రాజ్ నాథ్ సింగ్

క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది. కాగా ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. వైద్యుల బృందం రాజ్ నాథ్ సింగ్ ను పరీక్షించిందని, విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.  వాస్తవానికి ఆయన గురువారం ఢిల్లీలో జరగాల్సిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కు హాజరు కావాల్సి ఉంది. కానీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో ఉన్న రాజ్ నాథ్ హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
 
ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సింధియా తనకు కరోనా  రిపోర్టు పాజిటివ్ గా వచ్చిందని సోమవారం ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
 
  కాగా, దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు గత వారం రోజులుగా ప్రతీ రోజు 10 వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 12591 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం ప్రకటించింది.
 
 మరోవంక కరోనా సంబంధిత మరణాల సంఖ్య కూడా భారత్ లో క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఒక్క రోజే కరోనాతో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం నమోదైన 12,591 కొత్త కేసులతో కలుపుకుని దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 5.46 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 5.32 శాతానికి పెరిగింది. ప్రస్తుతం భారత్ లో కొరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 65,286 గా ఉంది.
 
ప్రస్తుతం ఒక్కసారిగా కొరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదు కావడానికి ప్రధాన కారణం కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్ XBB.1.16 సబ్ వేరియంటేనని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ ఒమిక్రాన్ XBB.1.16 సబ్ వేరియంట్ ప్రాణాంతకం కాదని, హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం కూడా ఉండదని, స్వల్ప లక్షణాలతో కొన్ని రోజులు బాధించి, కనుమరుగు అవుతుందని వివరిస్తున్నారు.
 
ప్రస్తుతం కర్నాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోలాహలం పెరుగుతున్న కర్ణాటకలో 1962 యాక్టివ్ కేసులుండడం ఆందోళనకరంగా మారింది. అలాగే కేరళలో 19398 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 6102 యాక్టివ్ కేసులు, గుజరాత్ లో 2091 యాక్టివ్ కేసులు, తమిళనాడులో 3563 యాక్టివ్ కేసులు, హిమాచల్ ప్రదేశ్ లో 1672 యాక్టివ్ కేసులు, హరియాణాలో 4891 యాక్టివ్ కేసులు ఉన్నాయి.