మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురు

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వ్యవహారంలో సుప్రీం కోర్టులో రామోజీ గ్రూపు సంస్థలకు చుక్కెదురైంది. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో డిపాజిట్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది.

డిపాజిట్ దారులకు చెల్లింపులు చేశామన్న మార్గదర్శి తరపు వాదనలపై ఉండవల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. చెల్లింపులు చేశాక డిపాజిటర్ల సమాచారం బయట పెట్టడానికి ఇబ్బంది ఏమిటని ఉండవల్లి నిలదీశారు. ఉండవల్లి వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు డిపాజిట్ల వివరాలను బయట పెట్టాలని ఆదేశించింది.

మార్గదర్శిలో పెట్టుబడులు ఎంత మేరకు ఉన్నాయి? చెల్లింపులు ఎంత ఉన్నాయనే సంగతి తేల్చాలని ఆదేశించింది. వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకని ధర్మాసనం మార్గదర్శి సంస్థను ప్రశ్నించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌ జే.బీ.పర్డీవాలా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

మార్గదర్శి సంస్థను హిందూ అన్‌ డివైడెడ్ ఫ్యామిలీ అని చెబుతూనే మరోవైపు ప్రొప్రైటరీ కన్సర్న్ అని చెప్పడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్గదర్శి సంస్థలో డిపాజిట్లు ఎంతో బయట పెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. డిపాజిట్ దారులందరికి చెల్లింపులుచేశామని మార్గదర్శి న్యాయవాది తెలుపగా, చెల్లింపులు జరిపిన తర్వాత వివరాలను బయట పెట్టడానికి అభ్యంతరం ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించడంతో పిటిషనర్ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.

మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయ పోరాటంలో కీలక మలుపు తిరిగినట్లైంది. కొన్నేళ్లుగా డిపాజిట్ల వివరాలు బయటపెట్టకుండా ఎందుకు దాస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. రూ.2600 కోట్ల డిపాజిట్లు ఎక్కడి నుంచి వచ్చాయని, డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారని, చెక్కుల రూపంలో ఇచ్చారా? మరో రూపంలో ఇచ్చారా అని సుప్రీం కోర్టు నిలదీసింది.

డిపాజిటర్ల వివరాలను కోర్టుకు అందజేయాలని తేల్చి చెప్పింది. కోర్టు విచారణలో ఒకచోట హెచ్‍యుఎఫ్, మరో ప్రొప్రైటరీ అని ఎందుకు రాశారని నిలదీసింది. ఈ విషయాలన్నింటికీ సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‍కుమార్ నిలదీశారు.