బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పై దర్యాప్తు

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్పై ఆ దేశ పార్లమెంటుకు చెందిన కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్ ఇటీవల దర్యాప్తును ప్రారంభించింది. ఆసక్తి ప్రకటనపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ విషయాన్ని కమిషనర్ వెబ్‌సైట్ ద్వారా తెలిపింది. రిషి సతీమణి అక్షత మూర్తికి ఓ చైల్డ్‌కేర్ సంస్థలో వాటాలు ఉండటంతో, ప్రభుత్వ విధానం వల్ల ఆ కంపెనీకి ఏమైనా ప్రయోజనాలు చేకూరాయేమో గుర్తించడం కోసం ఈ దర్యాప్తు జరుగుతోందని రిషి తరపున ఓ అధికార ప్రతినిధి తెలిపారు.

ఓపెన్ ఇంక్వైరీస్ జాబితాను కమిషనర్ ఫర్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ఏప్రిల్ 13 నుంచి రిషి సునాక్‌పై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపింది. ఆసక్తి ప్రకటనపై ఈ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపింది.  రిషి సునాక్ ప్రభుత్వం మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఓ విధానాన్ని ప్రకటించారు. దీని వల్ల ఓ చైల్డ్‌కేర్ కంపెనీ ప్రయోజనం పొందుతున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఆ చైల్డ్‌కేర్ కంపెనీలో రిషి సతీమణి అక్షత మూర్తికి వాటాలు ఉన్నాయని ఈ కథనాలు తెలిపాయి.

దీనిపై దర్యాప్తు జరపాలని ప్రతిపక్ష లిబరల్ డెమొక్రాట్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుగుతోంది. రిషి సునాక్ అధికార ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, తాము కమిషనర్ దర్యాప్తునకు సంతోషంగా సహకరిస్తామని తెలిపారు. అత్యంత పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తామని చెప్పారు.

హౌస్ ఆఫ్ కామన్స్ ప్రవర్తన నియమావళి, రిజిస్టర్లు సక్రమంగా ఉండేలా పర్యవేక్షించే బాధ్యత కమిషనర్‌దే. ఏమైనా ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపణలు వస్తే, వాటిపై కూడా దర్యాప్తు జరుపుతారు. ప్రవర్తన నియమావళి ప్రకారం పార్లమెంటు సభ్యులు తమకుగల ఆర్థిక ప్రయోజనాల గురించి వెల్లడించవలసి ఉంటుంది. ఈ ప్రయోజనాల వల్ల పార్లమెంటు సభ్యునిగా తన చర్యలు ప్రభావితమవుతాయని, పార్లమెంటులో ప్రసంగాలు లేదా ఓటు వేసే తీరును ప్రభావితం చేయవచ్చునని ఇతరులు భావించే అవకాశం ఉండవచ్చు, అటువంటి సందర్భాల్లో తమకుగల ఆర్థిక ప్రయోజనాలను ఎంపీలు వెల్లడించవలసి ఉంటుంది.

ఈ దర్యాప్తులో రిషి సునాక్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు కమిషనర్ గుర్తిస్తే, క్షమాపణ చెప్పాలని ఆయనను ఆదేశించవచ్చు. భవిష్యత్తులో అటువంటివి జరగకుండా సూచనలు చేయవచ్చు. మరింత తీవ్రమైన కేసులను ఓ కమిటీకి నివేదించే అవకాశం ఉంటుంది. ఆ కమిటీ అవసరమైతే ఇతర ఆంక్షలను విధిస్తుంది. మౌఖిక లేదా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని కోరవచ్చు. జీతాన్ని నిలిపేయడం, సభ నుంచి కొంత కాలం సస్పెండ్ చేయడం, బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోవచ్చు.