సుడాన్ ఘర్షణల్లో 200 మంది మృతి

సుడాన్ దేశంలో జరిగిన ఘర్షణల్లో 200 మంది మరణించారు. సుడాన్‌ దేశంలో సైన్యం, పారామిలిటరీల మధ్య జరిగిన పోరులో  200 మంది మరణించగా, మరో 1,800 మంది గాయపడ్డారు. క్షతగాత్రులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 97 మంది పౌరులు మరణించారు.
 
అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లరాదని, ఇంటిపట్టునే వుండాలని అక్కడి భారతీయులను భారత దౌత్య కార్యాలయం హెచ్చరించింది. తక్షణమే కాల్పులను విరమించి, సాధారణ పరిస్థితిని పునరుద్ధరించాలని సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది. సూడాన్‌ సైన్యం, ప్రత్యర్ధుల మధ్య చెలరేగిన ఘర్షణలతో రాజధాని ఖర్తూమ్‌ అట్టుడుకుతోంది.
 
బుల్లెట్‌ గాయాలతో ఆదివారం భారతీయుడొకరు మరణించడం పట్ల మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఖార్టూమ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఆ దేశంలో సంభవిస్తున్న పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
 
సూడాన్‌ సైన్యం, పారా మిలటరీ బలగాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో ఖార్టూమ్‌లోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్ళు, ఘర్షణలు చెలరేగుతున్నాయి. సూడాన్‌లో దాదాపు 4వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 1200 మంది దశాబ్దాల క్రితమే ఆ దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 2021 అక్టోబరులో కుట్ర ద్వారా సూడాన్‌ మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకుంది.
 
అప్పటి నుండి సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్బుల్ ఫట్టా అల్ బుర్హాన్‌కు, పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న అతని డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య సాగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది. దౌత్యవేత్తలు కాల్పుల విరమణ కోసం పిలుపు ఇచ్చినప్పటికీ పోరాటం సాగుతూనే ఉంది.
 
సుడాన్‌లోని యూరోపియన్ యూనియన్ రాయబారి ఇంటిపై సోమవారం దాడి జరిగినట్లు బ్లాక్ అగ్ర దౌత్యవేత్త జోసెప్ బోరెల్ తెలిపారు.సుడాన్ దేశం వైమానిక దాడులు, ఫిరంగి దళాల కాల్పులతో దద్దరిల్లింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు రొట్టెలు, పెట్రోల్ కోసం జనం బారులు తీరారు.  తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సూడాన్‌ కమ్యూనిస్టు పార్టీ (ఎస్‌సిపి) విజ్ఞప్తి చేసింది.
 
ఈ ఘర్షణలు, హింసాకాండలో బాధితులంతా సామాన్యులని, విప్లవ సాధనకు, ప్రజాస్వామ్య పౌర పాలన కోసం కృషి చేస్తున్న వారేనని ఎస్‌సిపి పేర్కొంది. నగరాలు, గ్రామాల నుండి సైనికులు, ఉగ్రవాదులు వైదొలగాలని, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పౌర సమావేశాలకు వారిని దూరంగా వుంచాలని కోరింది. అధికారం, సంపద కోసం కొన్ని విదేశీ శక్తులు ప్రోత్సహించిన ఘర్షణలే ఇవి అని పేర్కొంది.
 
ఈ పరిస్థితుల గురించి తాము ఎప్పటి నుండో హెచ్చరిస్తూనే ఉన్నామని ఈ ఘర్షణలు ప్రజల్లో భయాందోళనలు, అయోమయం వ్యాపింప చేస్తున్నాయని పార్టీ పేర్కొంది. మన ప్రజలు, దేశభక్తియుత శక్తులు, రాడికల్‌ మార్పుల కోసం పోరాడే శక్తులన్నీ సమైక్యంగా వుండడమే ప్రస్తుత సంక్షోభ పరిష్కారానికి ప్రాతిపదిక అని పేర్కొంది.

సూడాన్‌ సైన్యం, పేరా మిలటరీ బలగాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు, పెద్ద సంఖ్యలో గాయపడేందుకు కారణమైన ఘర్షణలను గుటెరస్‌ తీవ్రంగా ఖండించారని ఆయన ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మృతి చెందిన వారిలో ప్రపంచ ఆహార కార్యక్రమానికి చెందిన వారు ముగ్గురు వుండగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉద్రిక్తతలకు కారణమైన వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆ ప్రకటన కోరింది. తక్షణమే ఘర్షణలను విరమించి, చర్చల ద్వారా ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా చూడాల్సిందిగా గుటెరస్‌ ఉభయ పక్షాలను కోరారు.