జగదీశ్ శెట్టర్ ను కర్ణాటక ప్రజలు క్షమించరు

కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించడంతో ఆదివారం బిజెపికి రాజీనామా చేసి, సోమవారం కాంగ్రెస్ లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ను కర్ణాటక ప్రజలు క్షమించరని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత బి.ఎస్. యడియూరప్ప హెచ్చరించారు.
ఆయనను (శెట్టర్‌) కర్ణాటక ముఖ్యమంత్రిని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేశాం.. ఆయన ఇచ్చిన ప్రకటనలు మమ్మల్ని అసంతృప్తికి గురి చేశాయి. జగదీశ్‌ షెట్టర్‌ గురించి బీజేపీ వల్లనే ప్రజలకు తెలుసు.. ఆయన ఎందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నారని జగదీశ్‌ షెట్టర్‌ని అడగాలనుకుంటున్నాను. ఆయన తిరిగి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం’’ అని యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.
 
కేంద్ర మంత్రి, కర్ణాటక ఎన్నికల ఇన్ ఛార్జ్  ధర్మేంద్ర ప్రధాన్ జగదీష్ షట్టర్‌ ను కలిసి కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని, ఆయన కుటుంభం సభ్యునికి అసెంబ్లీ సీట్ ఇస్తామని చెప్పారని, అయితే ఆయన దానిపై స్పందించలేదని యడియూరప్ప వెల్లడించారు.
 
ఇటీవల, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది కూడా పార్టీ టికెట్ నిరాకరించడంతో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మే 10న జరగనున్న ఎన్నికల్లో సవాడి అథని నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ‘బీజేపీ జాతీయ పార్టీ.. నాకు, జగదీష్‌ శెట్టర్‌, లక్ష్మణ్‌ సవాడి తదితరులకు బీజేపీ మంచి స్థానం కల్పించింది. లక్ష్మణ్‌ సవాడిని మంత్రిని చేశారు. ఎన్నికల్లో ఓడిపోయాక ఎమ్మెల్సీని చేశాం.. ఎన్నో అవకాశాలు ఇచ్చాం’ అని  యడ్యూరప్ప గుర్తు చేశారు.
 
“నేను లక్ష్మణ్ సవాడి అనుచరులను అడగాలనుకుంటున్నాను. మేము అతనికి ఏమి తప్పు చేసాము? అతను ఎందుకు కాంగ్రెస్‌లో చేరాడు,” అంటూ మాజీ ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారు.  బెంగళూరులోని కాంగ్రెస్   పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో   జగదీశ్ శెట్టర్ సోమవారం  కాంగ్రెస్ లో చేరారు.  
కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన, ప్రహ్లాది జోషి, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై జగదీశ్ శెట్టర్ ను కలిసి, పార్టీ నుండి వెళ్లిపోకుండా నిలుపుదల చేసేందుకు చివరి ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన వినిపించుకోలేదు.  జగదీశ్ షెట్టర్ రాజీనామా  తనను బాధించిందని, పార్టీలోనే కొనసాగితే బాగుండేదని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చెప్పారు. సీనియర్ నేతగా ఆయన బిజెపికి చాలా ముఖ్యమైన వ్యక్తి అని అంటూ ఆయన సేవలు పార్టీకి అవసరమనే ఉద్దేశంతో స్వయంగా హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఓ పోస్టును షెట్టర్ కు ఆఫర్ చేశారని వెల్లడించాయిరు. అయినా షెట్టర్ వినిపించుకోలేదని, పార్టీకి, శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారని బొమ్మై విచారం వ్యక్తం చేశారు.
 
ఆయన్ను పార్టీలో కొనసాగించేందుకు బీజేపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ తెలిపారు. ఈసారి ఆయనను బరిలోకి దింపకూడదనే పార్టీ నిర్ణయం వెనుక ఎలాంటి ‘కుట్ర’ లేదని కటీల్ స్పష్టం చేశారు.