ముఖంపై త్రివర్ణ పతాకం గల యువతికి స్వర్ణాలయంలో పరాభవం

దేశంలో ప్రసిద్ధ ఆలయాలలో ఒకటైన, సిక్కుల ప్రముఖ యాత్రా కేంద్రమైన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోకి ముఖంపై త్రివర్ణ పతాకం వేయించుకున్న ఓ యువతి వెళ్లేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు ఆమెను అడ్డుకున్నారు. బాలిక తన ముఖంపై భారత జాతీయ పతాకాన్ని పెయిటింగ్‌గా వేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దుమారం రేగింది. స్వర్ణాలయాన్ని ఖలిస్తానీలు చేజిక్కించుకున్నారా అన్న శీర్షికతో ఒక 40 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. మొహానికి త్రివర్ణ పతాకాన్ని పెయింట్ వేసుకున్న ఒక మహిళ స్వర్ణాలయంలోకి ప్రవేశించకుండా తనను అడ్డుకున్న సేవాదార్‌తో వాగ్వాదం పెట్టుకోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

ఆమె మరో వ్యక్తికి ఈ విషయం గురించి ఫిర్యాదు చేయగా ఈ మహిళను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సేవాదార్‌ను ఆ వ్యక్తి ప్రశ్నించడం చూడవచ్చు. ఆమె తన మొహంపై త్రివర్ణ పతాకాన్ని టాటూ వేసుకోవడం పట్ల సేవాదార్ అభ్యంతరం తెలియచేయగా అప్పుడు ఆ వ్యక్తి ఇది భారతదేశం కాదా అని ప్రశ్నించారు. ఇది పంజాబ్ అంటూ సేవాదార్ జవాబివ్వడం వీడియోలో చూడవచ్చు.

దీంతో ఆ మహిళ తన వాదన కొనసాగిస్తూ స్వర్ణాలయం భారత్‌లో లేదన్నట్లు ఆ సేవాదార్ మాట్లాడడం బక్వాస్(చెత్త) అంటూ మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ(ఎస్‌జిపిసి) స్పందించింది. జనరల్ సెక్రటరీ క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, బాలిక ముఖంపై వేసుకున్నది త్రివర్ణ పతాకం కాదని ఆయన స్పష్టం చేశారు.

‘‘ఇది సిక్కుల మందిరం.. ప్రతీ మతంలోనూ ప్రత్యేకమైన అలంకరణలు ఉంటాయి. మేము అందరినీ ఆహ్వానిస్తాం. అధికారులు తప్పుగా ప్రవర్తిస్తే అందుకు క్షమాపణలు చెబుతున్నాం. బాలిక ముఖంపై ఉన్నది మన భారత జాతీయ పతాకం కాదు. దానిపై అశోక చక్రం లేదు. అది రాజకీయ పతాకం అయి ఉండవచ్చు’’ అని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి  గురుచరణ్ సింగ్ గ్రెవాల్ ఓ ప్రకటనలో తెలిపారు.

స్వర్ణ దేవాలయంలోకి బాలికను వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సెక్యూరిటీ గార్డులు ‘ఇది భారత్ కాదు, ఇది పంజాబ్’ అన్న మాటలు కూడా అందులోని వినిపిస్తున్నాయి. ఆమె పట్ల సిబ్బంది దురుసుగానే ప్రవర్తించారు. ఆమె మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. అట్టారి-వాఘా సరిహద్దు వద్ద జరిగే సైనిక కవాతులను చాలా మంది సందర్శిస్తుంటారు. ఆ సమయంలో త్రివర్ణ పతాకాలను పెయింటింగ్‌గా వేయించుకుని, అటు నుంచి స్వర్ణ దేవాలయన్ని సందర్శిస్తుంటారు.