‘బీబీసీ’పై ఈడీ కేసు నమోదు

బ్రిటీష్ బ్రాడ్‍కాస్టింగ్ కార్పొరేషన్ ఇండియాపై ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కేసు నమోదు చేసింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం కింద బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. విదేశీ మారకద్రవ్యం విషయంలో నిబంధనలు ఉల్లఘించినట్టు ఆరోపణలు నమోదు చేశారు.
బీబీసీ ప్రధాన కార్యాలయం బ్రిటన్‍లో ఉంది.
భారత దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కోవడం బీబీసీకి ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఢిల్లీలోని బీబీసీ ఇండియా కార్యాలయంలో ఐటీ సర్వే చేశారు. సుమారు మూడు రోజుల పాటు సోదాలు చేశారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని రోజులకు ఈ పరిణామాలు జరిగాయి.
ఇప్పుడు బీబీసీపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‍మెంట్ యాక్ట్ కింద కొన్ని పత్రాలు, స్టేట్‍మెంట్లు ఇవ్వాలని బీబీసీకి చెందిన కొందరు ఎగ్జిక్యూటివ్‍లకు ఈడీ సూచించింది.  ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విషయంలో నిబంధనల ఉల్లంఘనపై బీబీసీ విచారణ ఎదుర్కొంటుందని రిపోర్టులు వస్తున్నాయి. బీబీసీ అకౌంట్ బుక్‍ల్లో తాము కొన్ని అవకతవకలను గుర్తించినట్టు ఫిబ్రవరిలో సోదాలు నిర్వహించాక ఐటీ అధికారులు వెల్లడించారు.
బీబీసీ పరిధిలోని విదేశీ సంస్థలు భారత్‍లో కార్యకలాపాలు చేసుకుంటున్నా పన్ను చెల్లించకుండా ఎగరగొట్టాయని ఆరోపించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఇండియా: ది మోదీ క్వశ్చన్ అంటూ ఓ డాక్యుమెంటరీ సిరీస్‍ను జనవరిలో బీబీసీ ప్రసారం చేసింది. రెండు భాగాలుగా దీన్ని తీసుకొచ్చింది. ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

బీబీసీ వలసవాద మనస్తత్వానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోందని, నిరాధారణ ఆరోపణలతో బురద జల్లేందుకు డాక్యుమెంటరీ రూపొందించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దేశంలో నిషేధాన్ని విధించింది. ఈ బీబీసీ డాక్యుమెంటరీపై భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేగింది. బీబీసీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో సోదాలు చేశారు. ఐటీ సర్వే నిర్వహించారు. ఇప్పుడు ఈడీ కూడా బీబీసీపై ఫెమా కింద కేసు నమోదు చేసింది.