సుఖేష్ ‌‌– కవిత వాట్సాప్ చాట్ వివరాలు వెల్లడి

మనీలాండరింగ్, చీటింగ్ కేసులో ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అన్నంతపని చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో గతంలో జరిపిన వాట్సాప్ చాట్ వివరాలను బుధవారం వెల్లడించారు. వాట్సాప్ చాటింగ్ వివరాలు అంటూ 20 పేజీల లేఖను తన లాయర్ ద్వారా విడుదల చేశారు సుఖేష్. ఢిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రూ. 15 కోట్లు  ఇచ్చినట్లు తన లేఖలో సుఖేష్ మరోసారి స్పష్టం చేశాడు.

ఎమ్మెల్సీ కవిత పేరును తన ఫోన్ నెంబర్ లో `కవిత అక్క టీఆర్ఎస్’ పేరుతో సేవ్ చేసుకున్నాడు. కవితతో చాటింగ్ చేసినట్లు చెబుతున్న ఆరు పేజీల చాట్ వివరాలను సుఖేష్ వెల్లడించాడు. అక్కా.. అక్కా అంటూ పరుమార్లు తెలుగులోనూ చాట్ చేయటం విశేషం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేసిన వివరాలతోపాటు, ఎవరి ఆదేశాలతో డబ్బులు ఎక్కడ, ఎప్పుడు అప్పగించింది వివరంగా రాసుకొచ్చాడు.

దీనిపై విచారణ చేయాలంటూ లేఖను భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర హోం మంత్రికి, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్,  సీబీఐ డైరెక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు  పంపించారు.  వాట్సాప్ చాట్ లో కోడ్ భాష వివరాలను కూడా లేఖలో స్పష్టం చేశారు సుఖేష్ చంద్రశేఖర్.

 ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్ అని, ఎస్ జే అంటే సత్యేంద్రజైన్ అని, మనీష్ అంటే మనీష్ సిసోడియా అని, అరుణ్ అంటే అరుణ్ పిళ్లై అని, జేహెచ్ అంటే జూబ్లీహిల్స్ అని.. , ఆఫీస్ అంటే పార్టీ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద టీఆర్ఎస్ అని, ప్యాకేజీ అంటే రూ. 15 కోట్లు అని సుఖేష్ వివరించాడు.  బ్రో అంటే సత్యేంద్రజైన్ అని, 15కేజీ నెయ్యి అంటే రూ. 15 కోట్ల డబ్బు అని, 25 కేజీ నెయ్యి అంటే రూ. 25 కోట్లు అని, సిస్టర్ అంటే కె.కవిత అని, ఏకే భాయ్ అంటే అరవింద్ కేజ్రీవాల్ అని కోడ్ భాష వివరాలను సుఖేష్ వెల్లడించాడు.

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సుఖేశ్‌ ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు. ఆప్‌ నేతలపై కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు డబ్బులు ఇచ్చినట్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు వాట్సాప్ చాట్ రిలీజ్ చేయటంతోపాటు, దీనిపై విచారణ చేయాలని సీబీఐ, సుప్రీంకోర్టు జడ్జి, గవర్నర్, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాయటం సంచలనంగా మారింది.

గతంలోనూ సుకేష్ తన లాయర్ ద్వారా లేఖలు విడుదల చేశారు. దిల్లీ అరవింద్ కేజ్రీవాల్‌తో తాను చేసిన మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్‌లు చేశానని సుఖేష్ చంద్రశేఖర్ లేఖ ద్వారా వెల్లడించారు. అందులో కేజ్రీవాల్ చెప్పినట్లుగా తాను రూ. 75 కోట్లను.. హైదరాబాద్ బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ఏకే అనే వ్యక్తికి ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే బీఆర్ఎస్ ఆఫీసు ప్రాంగణంలోనే రేంజ్ రోవర్‌లో ఉన్న ఏపీ అనే వ్యక్తికి ఆ డబ్బు ఇచ్చినట్లు చెప్పాడు. ఏపీ అనే వ్యక్తి కూర్చున్న రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని కూడా సుకేశ్ లేఖలో పేర్కొన్నాడు.