భారత్ సాయం కోరిన ఉక్రెయిన్ ప్రధాని

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత దేశం అందిస్తున్న మానవతా సాయాన్ని మరింత పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన లేఖ రాశారని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రష్యా దురాక్రమణతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని జెలెన్ స్కీ ఆ లేఖలో పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం అందిస్తున్న మానవతా సాయానికి కృతజ్ఞలు తెలిపిన జెలెన్ స్కీ ఈ సాయాన్ని మరింత పెంచాలని కోరారు. మన దేశ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ మంత్రి ఎమినె జపరోవా ఈ లేఖలను విదేశాంగ శాఖ సహాయక మంత్రి మీనాక్షీ లేఖికి అందజేశారు.

రష్యా దురాక్రమణతో దెబ్బతిన్న తమ దేశాన్ని ఆదుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, మందులు, వైద్య పరికరాలు, తదితర అత్యవసర వస్తువులను మరింత ఎక్కువగా పంపించాలని కోరారని మీనాక్షీ లేఖి చెప్పారు.

దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని, సాయాన్ని మరింత పెంచాలని సూచించారని మంత్రి చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌  మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్‌ నుంచి ఎమినే జపరోవా మరింత సహకారాన్ని కోరారు.

ప్రధాని మోదీ, ఇతర ఉన్నతాధికారులు తమ దేశంలో పర్యటించాలని కోరారు. అయితే.. ఇతర దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాల విషయంలో సూచనలు చేసే స్థితిలో తమ దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్‌ భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోన్న విషయం తెలిసిందే. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఈ దిగుమతులు పెరిగాయి. 

కేంద్ర మంత్రి మీనాక్షి లేఖితో ఎమినీ ఝపరోవా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను చర్చించారు. రష్యా తో యుద్ధం ప్రారంభమైన తరువాత ఉక్రెయిన్ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధి భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారత ప్రధాని స్పష్టం చేయడాన్ని ఈ సందర్భంగా ఝపరో వాగుర్తు చేసుకున్నారు. 
ఈ సంవత్సరం భారత్ లో జరుగనున్న జి20 సదస్సుకు ఉక్రెయిన్ ప్రధానిని కూడా ఆహ్వానించాలని, ఈ సమావేశాలలో ఉక్రెయిన్ అధికారులకు పాల్గొనే అవకాశం కలిగించాలని ఆమె భారత ప్రభుత్వాన్ని కోరారు.